Body Swelling: సాధారణంగా రోజంతా ఎక్కువగా నిలబడినా, లేదా ఎక్కువ దూరం ప్రయాణించినా కాళ్లలో కొద్దిగా వాపు రావడం సహజం. కానీ ఎలాంటి కారణం లేకుండా తరచూ కాళ్లు, చేతులు, ముఖం లేదా పొత్తికడుపు భాగంలో వాపులు వస్తుంటే మాత్రం దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వైద్య పరిభాషలో శరీర భాగాల్లో ద్రవాలు పేరుకుపోయి వాపు రావడాన్ని ఎడెమా అంటారు. శరీరంలో వచ్చే ఈ వాపులు అంతర్గతంగా దాగున్న 5 తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు హెచ్చరిక కావచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

వాపుల వెనుక దాగుండే 5 ప్రధాన ఆరోగ్య సమస్యలు..

గుండె జబ్బులు :

గుండె రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేనప్పుడు, రక్తం వెనక్కి తన్ని కాళ్లు, పాదాలు, మడమల్లో ద్రవాలు పేరుకుపోతాయి. దీనివల్ల కాళ్లలో విపరీతమైన వాపు వస్తుంది. ఒక్కోసారి ఊపిరితిత్తులలో కూడా నీరు చేరి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.

కిడ్నీ సమస్యలు:

మన శరీరంలోని వ్యర్థాలను, అదనపు ద్రవాలను బయటకు పంపడంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు శరీరంలో సోడియం, నీరు పేరుకుపోతాయి. దీనివల్ల ముఖ్యంగా కళ్ల చుట్టూ, కాళ్లలో వాపులు కనిపిస్తాయి.

లివర్ దెబ్బతినడం:

లివర్ తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు శరీరంలో అల్బుమిన్ అనే ప్రోటీన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ ప్రోటీన్ లోపం వల్ల రక్తం నుంచి ద్రవాలు బయటకు వచ్చేసి.. ముఖ్యంగా పొత్తికడుపు భాగంలో కాళ్లలో నీరు చేరి వాపులు వస్తాయి.

సిరల సమస్యలు :

కాళ్ల నుంచి రక్తాన్ని తిరిగి గుండెకు చేరవేసే సిరల్లోని వాల్వ్‌లు బలహీనపడితే, రక్తం పైకి వెళ్లకుండా కాళ్లలోనే నిలిచిపోతుంది. దీనివల్ల కాళ్లలో దీర్ఘకాలికంగా వాపులు, నరాల వాపు కనిపిస్తాయి.

లింఫెడెమా :

మన శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడే లింఫ్ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు లేదా లింఫ్ నాళాల్లో బ్లాక్స్ ఏర్పడినప్పుడు, ఆ ద్రవం బయటకు వెళ్లలేక చేతులు లేదా కాళ్లలో విపరీతమైన వాపుకు దారితీస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story