Eyes Tearing Up: కళ్ల నుండి నీరు కారుతోందా..? అయితే అది ఈ ప్రమాదకర వ్యాధుల లక్షణం కావచ్చు.. తస్మాత్ జాగ్రత్త
అయితే అది ఈ ప్రమాదకర వ్యాధుల లక్షణం కావచ్చు.. తస్మాత్ జాగ్రత్త

Eyes Tearing Up: సాధారణంగా గాలి, దుమ్ము లేదా ఎక్కువ సేపు మొబైల్, ల్యాప్‌టాప్ చూడటం వల్ల కళ్ళు ఎర్రబడటం, నీరు కారడం జరుగుతుంది. కానీ ఈ సమస్య పదేపదే వేధిస్తుంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలి. ఎందుకంటే కంటి నుండి నిరంతరం నీరు రావడం అనేది అలెర్జీలు, ఇన్ఫెక్షన్లే కాకుండా కన్నీటి నాళాలు మూసుకుపోవడానికి కూడా సంకేతం కావచ్చు.
కళ్లు నీళ్లు కారడానికి ప్రధాన కారణాలు ఏమిటి?
సర్ గంగా రామ్ ఆసుపత్రి కంటి విభాగం మాజీ అధిపతి డాక్టర్ ఎ.కె. గ్రోవర్ అభిప్రాయం ప్రకారం, ఈ సమస్య వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఇవే:
అలెర్జీ కండ్లకలక: కళ్లు దురద పెట్టడం, ఎర్రగా మారడం, నీరు కారడం దీని లక్షణం.
డ్రై ఐస్: ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కళ్లు ఎండిపోయినప్పుడు కూడా ఆ పొడిబారిన పరిస్థితిని అధిగమించడానికి శరీరం సహజంగానే ఎక్కువ కన్నీళ్లను ఉత్పత్తి చేస్తుంది.
కన్నీటి నాళాలు మూసుకుపోవడం: కన్నీళ్లు బయటకు వెళ్లే నాళాల్లో అడ్డంకులు ఏర్పడితే, అవి కంటిలోనే ఉండిపోయి నిరంతరం బయటకు కారుతుంటాయి.
సైనస్ సమస్యలు: సైనసైటిస్ సమస్య ఉన్నవారిలో ముక్కు, కంటి మార్గాలపై ఒత్తిడి పెరిగి కళ్ల నుండి నీరు వస్తుంది.
వృద్ధాప్యం: వయస్సు పెరిగే కొద్దీ కంటి కండరాలు బలహీనపడటం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది.
మీ కళ్లను ఎలా కాపాడుకోవాలి?
కంటి ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలంటే కింది సూచనలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు:
కళ్లను రుద్దకండి: కళ్లు నీళ్లు కారుతున్నప్పుడు లేదా దురద పెడుతున్నప్పుడు వేళ్లతో బలంగా రుద్దడం వల్ల ఇన్ఫెక్షన్ మరింత పెరిగే అవకాశం ఉంది.
స్క్రీన్ టైమ్ తగ్గించండి: మొబైల్, టీవీలను గంటల తరబడి చూడటం ఆపండి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కళ్ళకు విశ్రాంతి ఇవ్వండి.
శుభ్రత పాటించండి: మురికి చేతులతో కళ్ళను తాకకూడదు. రోజూ రెండు మూడు సార్లు చల్లటి నీటితో కళ్ళను మెల్లగా కడుక్కోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
రక్షణ కవచం: బయటకు వెళ్ళేటప్పుడు దుమ్ము, పొగ, గాలి నేరుగా కళ్ళకు తగలకుండా సన్ గ్లాసెస్ ధరించడం ఉత్తమం.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?
నీరు కారడంతో పాటు చూపు మసకబారడం, కళ్ళలో విపరీతమైన నొప్పి లేదా వాపు ఉన్నట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిపుణులను సంప్రదించాలి. సొంతంగా ఐ డ్రాప్స్ వాడటం కంటే డాక్టర్ సలహాతో చికిత్స తీసుకోవడమే సురక్షితం.

