Fatty Liver: పట్టణాల్లో పెరిగిపోతున్న ఫ్యాటీ లివర్..ఈ ఒక్క పండు తింటే చాలు!
ఈ ఒక్క పండు తింటే చాలు!

Fatty Liver: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో.. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ఈ వ్యాధి.. ముదిరే వరకు ఎలాంటి లక్షణాలను బయటకు చూపించదు. అందుకే దీనిని 'సైలెంట్ కిల్లర్' అని కూడా అంటారు. అయితే, ఈ ప్రాణాంతక సమస్యకు మనకు అందుబాటులో ఉండే నారింజ పండ్లతో చెక్ పెట్టవచ్చని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ నిర్వహించిన ఒక ఆసక్తికరమైన అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 60 మంది బాధితులపై నాలుగు వారాల పాటు ఈ పరిశోధన చేశారు. వీరిని రెండు గ్రూపులుగా విడగొట్టి.. ఒక గ్రూపు వారికి ప్రతిరోజూ 400 గ్రాముల 'నవెలీనా' రకం నారింజ పండ్లను అందించారు. ఫలితంగా, నారింజ పండ్లు తిన్నవారిలో కాలేయ వాపు గణనీయంగా తగ్గడమే కాకుండా.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలోకి వచ్చినట్లు పరిశోధకులు గుర్తించారు.
అసలు నారింజ పండ్లే ఎందుకు తినాలి? నారింజలో ఉండే ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్,యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ కణజాలం చుట్టూ కొవ్వు చేరకుండా రక్షణ కవచంలా పనిచేస్తాయి. అయితే ఇక్కడో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. నారింజను జ్యూస్ రూపంలో కాకుండా.. పండును నేరుగా తొనల రూపంలోనే తినాలి. అప్పుడే దానిలో ఉండే పీచు పదార్థం లేదా ఫైబర్ మన శరీరానికి పూర్తిస్థాయిలో అందుతుంది.
మరి షుగర్ వ్యాధిగ్రస్తుల పరిస్థితి ఏంటి? డయాబెటిస్ ఉన్నవారు కూడా నారింజ పండ్లు తినవచ్చు.. కానీ మోతాదు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నారింజలోని సహజ చక్కెర రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి, షుగర్ ఉన్నవారు తమ డాక్టర్ లేదా డైటీషియన్ సలహా మేరకు మాత్రమే సరైన మోతాదును తీసుకోవాలి.
నారింజ పండ్లు కాలేయ ఆరోగ్యానికి తోడ్పడతాయి కానీ, ఇవి వ్యాయామానికో లేదా డాక్టర్ ఇచ్చే మందులకో ప్రత్యామ్నాయం మాత్రం కాదు. క్రమం తప్పకుండా శారీరక శ్రమ, సరైన జీవనశైలితో పాటు ఇలాంటి మంచి ఆహారపు అలవాట్లను పాటిస్తేనే.. ఫ్యాటీ లివర్ నుండి మనల్ని మనం కాపాడుకోగలం.

