Fatty Liver: గుట్టుచప్పుడు కాకుండా దాడి చేసే ఫ్యాటీ లివర్.. బయటపడడానికి గోల్డెన్ రూల్స్ ఇవే..
బయటపడడానికి గోల్డెన్ రూల్స్ ఇవే..

Fatty Liver: కాలేయంలో అధికంగా కొవ్వు పేరుకుపోవడాన్నే ఫ్యాటీ లివర్ అంటారు. ప్రస్తుత ఆధునిక జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, బరువు పెరగడం, పొట్ట చుట్టూ కొవ్వు చేరడం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి కారణాల వల్ల చాలామంది ఈ సమస్య బారిన పడుతున్నారు. ఈ వ్యాధి ప్రారంభ దశలో ఎటువంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. వేరే ఏదైనా ఆరోగ్య పరీక్ష లేదా స్కానింగ్ చేసుకున్నప్పుడే ఇది ప్రమాదవశాత్తు బయటపడుతుంది. అయితే ప్రారంభంలోనే అప్రమత్తమై జీవనశైలిలో కొన్ని కీలక మార్పులు చేసుకుంటే ఫ్యాటీ లివర్ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
ఆహార అలవాట్లలో విప్లవాత్మక మార్పులు..
ఫ్యాటీ లివర్‌ను నియంత్రించడంలో మనం తినే ఆహారమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. నూనెలు, వేయించిన పదార్థాలు, జంక్ ఫుడ్, మైదాతో చేసిన ప్రాసెస్డ్ ఆహారాలు, స్వీట్లు, కూల్ డ్రింక్స్ తీసుకోవడం బాగా తగ్గించాలి. వీటికి బదులుగా ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవాలి. తినే పరిమాణంపై కూడా నియంత్రణ ఉండాలి.
సురక్షితమైన రీతిలో బరువు తగ్గడం
పొత్తికడుపు చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉండటం ఫ్యాటీ లివర్‌కు ప్రధాన కారణం. కాబట్టి వైద్యుడు లేదా డైటీషియన్ సలహాతో బరువును అదుపులో ఉంచుకోవాలి. అయితే అకస్మాత్తుగా క్రష్ డైట్లు చేసి వేగంగా బరువు తగ్గడానికి ప్రయత్నించకూడదు. సమతుల్య ఆహారం, క్రమబద్ధమైన వ్యాయామం ద్వారా నెమ్మదిగా, సురక్షితంగా బరువు తగ్గడమే కాలేయ ఆరోగ్యానికి శ్రేయస్కరం.
వ్యాయామాన్ని దినచర్యగా మార్చుకోవడం..
రోజూ వాకింగ్, సైక్లింగ్, రన్నింగ్ లేదా ఈత వంటి శారీరక కార్యకలాపాలు చేయడం తప్పనిసరి. వారానికి కనీసం 150 నిమిషాల పాటు మధ్యస్థ తీవ్రత కలిగిన వ్యాయామం చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అలాగే గంటల తరబడి ఒకేచోట కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి అటూ ఇటూ నడవడం అలవాటు చేసుకోవాలి.
సుగర్, కొలెస్ట్రాల్ క్రమం తప్పక పర్యవేక్షించడం..
ఫ్యాటీ లివర్ ఉన్నవారికి ఇన్సులిన్ నిరోధకత, డయాబెటిస్, హై కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉండే అవకాశం ఎక్కువ. అందువల్ల ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్, లివర్ ఫంక్షన్ టెస్టులు చేయించుకోవాలి. ఇప్పటికే మధుమేహం లేదా కొలెస్ట్రాల్ ఉంటే వాటిని కఠినంగా అదుపులో ఉంచుకోవాలి.
ఆల్కహాల్, సొంత వైద్యానికి స్వస్తి..
కాలేయాన్ని వేగంగా దెబ్బతీసే అంశాల్లో మద్యపానం మొదటి వరుసలో ఉంటుంది. ఫ్యాటీ లివర్ నిర్ధారణ అయినవారు ఆల్కహాల్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. అంతేకాకుండా ఇంటర్నెట్ చూసి సొంతంగా లివర్ డిటాక్స్ పానీయాలు తాగడం, మూలికా నివారణలు లేదా సప్లిమెంట్లు వాడటం తీవ్ర ప్రమాదకరం. ఎలాంటి సప్లిమెంట్ వాడాలన్నా వైద్యుని సలహా తప్పనిసరి.

