Feeling Dizzy Frequently: చాలా మంది కూర్చుని ఒక్కసారిగా లేచినప్పుడో, లేదా సాధారణ సమయంలోనో కళ్లు తిరిగినట్లు అనిపిస్తుంటుంది. అలసటగా ఉందిలే అని దీనిని చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ, తరచూ ఇలా కళ్లు తిరగడం అనేది శరీరంలో కొన్ని రకాల విటమిన్ల లోపానికి ప్రధాన సంకేతం కావచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన శరీరంలోని రోగనిరోధక శక్తి, నరాల పనితీరు మరియు రక్త ప్రసరణ సజావుగా సాగడానికి విటమిన్లు చాలా అవసరం. అసలు శరీరంలో ఏ విటమిన్లు తగ్గితే కళ్లు తిరుగుతాయి? ఈ సమస్య నుండి ఎలా బయటపడాలనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

విటమిన్ బి12 లోపం

నరాల బలహీనత, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి విటమిన్ బి12 అత్యంత కీలకం. శరీరంలో ఈ విటమిన్ తగ్గినప్పుడు నరాల పనితీరు మందగిస్తుంది.

కళ్లు తిరగడానికి కారణం:

బి12 లోపం వల్ల మెదడుకు రక్త ప్రసరణ, ఆక్సిజన్ సరఫరా సరిగ్గా అందదు. దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, విపరీతమైన అలసటతో పాటు తరచూ కళ్లు తిరగడం, తలతిరగడం వంటి సమస్యలు వస్తాయి.

లభించే ఆహారాలు:

పాలు, పెరుగు, గుడ్లు, చీజ్, మాంసం వంటి వాటిలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. శాకాహారులు వైద్యుల సలహాతో బి12 సప్లిమెంట్స్ తీసుకోవచ్చు.

విటమిన్ డి లోపం

ఎముకల బలానికి మాత్రమే కాకుండా శరీర సమతుల్యతను కాపాడటంలో విటమిన్ డి ముఖ్య పాత్ర పోషిస్తుంది.

కళ్లు తిరగడానికి కారణం:

మన చెవి లోపలి భాగంలో ఉండే చిన్న కణాలు శరీర సమతుల్యతను నియంత్రిస్తాయి. విటమిన్ డి లోపించినప్పుడు చెవి లోపలి భాగంలో సమస్యలు తలెత్తి వర్టిగో లేదా కళ్లు తిరిగే సమస్య వస్తుంది.

లభించే ఆహారాలు:

ఉదయం పూట వచ్చే లేత ఎండ ద్వారా విటమిన్ డి సహజంగా లభిస్తుంది. అలాగే పుట్టగొడుగులు, గుడ్డులోని పచ్చసొన, ఫ్యాటీ ఫిష్ లలో ఇది దొరుకుతుంది.

ఐరన్, విటమిన్ సి లోపం

శరీరంలో ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. అయితే, మనం తినే ఆహారంలోని ఐరన్‌ను శరీరం సరిగ్గా గ్రహించాలంటే విటమిన్ సి చాలా అవసరం.

కళ్లు తిరగడానికి కారణం:

రక్తహీనత ఉన్నప్పుడు శరీరంలోని కణాలకు, ముఖ్యంగా మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. దీనివల్ల కొద్దిగా నడిచినా ఆయాసం రావడం, తరచూ కళ్లు తిరగడం జరుగుతుంది.

లభించే ఆహారాలు:

నిమ్మకాయలు, నారింజ, ఉసిరికాయ, జామపండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలు, బీట్‌రూట్, డ్రై ఫ్రూట్స్‌లో ఐరన్ లభిస్తుంది.

డీహైడ్రేషన్ - నీటి కొరత

విటమిన్లతో పాటు శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల కూడా కళ్లు తిరుగుతాయి. ముఖ్యంగా ఎండల్లో లేదా ఎక్కువ శారీరక శ్రమ చేసినప్పుడు శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోతాయి. దీనివల్ల బీపీ ఒక్కసారిగా డౌన్ అయి కళ్లు తిరుగుతాయి. కాబట్టి రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగాలి.

ముఖ్య గమనిక - ఎప్పుడు డాక్టర్‌ను కలవాలి?

కేవలం విటమిన్ల లోపమే కాకుండా గుండె సమస్యలు, తక్కువ రక్తపోటు, లేదా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా కళ్లు తిరగవచ్చు.

కళ్లు తిరగడంతో పాటు గుండెల్లో మంట లేదా నొప్పి రావడం

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం

ఓక వైపు కాళ్లు, చేతులు పడిపోయినట్లు అనిపించడం

ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story