Fenugreek: మెంతులతో మధుమేహానికి చెక్.. ఇలా వాడితే..
ఇలా వాడితే..

Fenugreek: ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ బారిన పడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. 2022లో 830 మిలియన్లకు పైగా ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడానికి ఆహార నియమాలు, జీవనశైలి మార్పులు ఎంత అవసరమో మనకు తెలుసు. మన ఇంట్లో సులభంగా లభించే మెంతులు మధుమేహాన్ని నియంత్రించడంలో చాలా బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.
మధుమేహానికి మెంతులు ఎలా ఉపయోగపడతాయి?
ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపరుస్తాయి: మెంతుల్లో ఉండే ఫైబర్, ఇతర రసాయనాలు జీర్ణక్రియను నెమ్మది చేస్తాయి. దీనివల్ల శరీరం కార్బోహైడ్రేట్లు, చక్కెరను గ్రహించే ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఇది శరీరం ఉత్పత్తి చేసే ఇన్సులిన్ మొత్తాన్ని పెంచి, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. మెంతులను రాత్రిపూట నానబెట్టి, ఉదయం ఆ నీటిని తాగడం చాలా మంచిది.
ఇన్సులిన్ నిరోధకత తగ్గిస్తాయి: మెంతి గింజలు ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో సహాయపడతాయి. తక్కువ ఇన్సులిన్ సున్నితత్వం ఉన్నవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. 2009లో జర్నల్ ఆఫ్ మెడిసినల్ ఫుడ్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, మెంతి పిండితో తయారు చేసిన బేక్ చేసిన వస్తువులను తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుందని తేలింది.
రక్తంలో చక్కెర నియంత్రణ: మెంతిలో కరిగే ఫైబర్ ఉంటుంది, ఇది కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ, శోషణను నెమ్మది చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. మెంతి పొడి లేదా మెంతి నీటిని రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం, ప్రతిరోజూ 10 గ్రాముల మెంతి గింజలను 4-6 నెలల పాటు తీసుకోవడం వల్ల HbA1c మరియు రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు మెంతిని తమ ఆహారంలో భాగంగా చేర్చుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. అయితే, ఏదైనా కొత్త చిట్కా పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.
