ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేసుకునే వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఈ క్రమంలో అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్) అత్యుత్తమ సూపర్‌ఫుడ్‌గా గుర్తింపు పొందుతున్నాయి. చిన్నగా కనిపించే ఈ గోధుమ రంగు గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, పీచు పదార్థం, ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అయితే వీటిని పచ్చిగా కంటే పెనంపై దోరగా వేయించి తినడం వల్ల రుచి పెరగడమే కాకుండా సులభంగా జీర్ణమవుతాయి. వేయించిన అవిసె గింజలు ఆరోగ్య ప్రయోజనాలను మరింతగా అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

గుండె ఆరోగ్యానికి ఇవి అండగా నిలుస్తాయి. వేయించిన అవిసె గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, లిగ్నన్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్)ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరిగేలా చేస్తాయి. తద్వారా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. రక్తపోటు నియంత్రణలో కూడా ఇవి సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. జీర్ణవ్యవస్థకు మేలు చేసే విధంగా అవిసె గింజల్లోని పీచు పేగులను శుభ్రపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వీటిని వేయించి తినడం వల్ల కడుపు ఉబ్బరం లేదా బరువుగా అనిపించే సమస్య తలెత్తదు. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలవిసర్జన సాఫీగా జరుగుతుంది.

బరువు నియంత్రణలో సహాయకారిగా ఇవి పనిచేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కని ఆహారం. దీనిలోని పీచు పదార్థం కడుపు నిండిన భావనను ఎక్కువ సేపు ఉంచుతుంది. ఫలితంగా పదేపదే ఆకలి వేయడం, అనవసరంగా ఎక్కువ తినడం తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడంలో కూడా వేయించిన అవిసె గింజలు తోడ్పడతాయి. ఇవి శరీరంలో గ్లూకోజ్‌ను నెమ్మదిగా విడుదల చేయడం వల్ల, తిన్న వెంటనే షుగర్ స్థాయులు అమాంతం పెరిగిపోకుండా కాపాడతాయి. మధుమేహం ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది.

చర్మం, కురుల సంరక్షణకు కూడా ఇవి ఉపయోగపడతాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మానికి తేమను అందించి, ముడతలు తగ్గేలా చేస్తాయి. చర్మానికి సహజమైన నిగారింపును ఇస్తాయి. అలాగే జుట్టు కుదుళ్లకు పోషణ అందించి, జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా, కురులు ఒత్తుగా, మెరుస్తూ ఉండేలా చూస్తాయి. హార్మోన్ల సమతుల్యతకు, రోగనిరోధక శక్తి పెంపుదలకు అవిసె గింజల్లోని లిగ్నన్స్ దోహదపడతాయి. ముఖ్యంగా మహిళలకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి, వివిధ రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షణ కల్పిస్తాయి.

ఎలా తీసుకోవాలంటే రోజూ ఒకటి నుంచి రెండు చెంచాల అవిసె గింజలను పెనంపై దోరగా వేయించి నేరుగా తినవచ్చు. వీటిని సలాడ్లు, పెరుగు, ఓట్స్ లేదా స్మూతీలలో కలుపుకొని తీసుకోవచ్చు. కావాలనుకుంటే వేయించిన గింజలను పొడిగా చేసి, కూరల్లో లేదా మజ్జిగలో కలుపుకొని కూడా వాడుకోవచ్చు. మొత్తంగా చూస్తే వేయించిన అవిసె గింజలు రుచి, జీర్ణత, పోషకాలు అన్నీ కలిపి ఆరోగ్యాన్ని పెంపొందించే అద్భుతమైన ఆహారంగా నిలుస్తాయి. తగినంత నీరు తాగుతూ మితంగా తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వారు ఇవి తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

Next Story