Following a High-Protein Diet: హై-ప్రోటీన్ డైట్ తీసుకుంటున్నారా? కడుపుబ్బరం, గ్యాస్ వేధిస్తుంటే ఈ చిన్న మార్పులు చేయండి..
మార్పులు చేయండి..

Following a High-Protein Diet: ఫిట్‌నెస్, బరువు తగ్గడం, కండరాల దృఢత్వం కోసం ప్రస్తుతం చాలామంది హై-ప్రోటీన్ డైట్ అనుసరిస్తున్నారు. గుడ్లు, మాంసం, పనీర్, పప్పుధాన్యాలు, ప్రోటీన్ షేక్‌లను ఆహారంలో భారీగా పెంచుకుంటున్నారు. అయితే సరైన సమతుల్యత లేకుండా ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం వల్ల కడుపుబ్బరం, విపరీతమైన గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వేధిస్తున్నట్లు చాలామంది చెబుతుంటారు. అసలు ప్రోటీన్ వల్ల ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనిని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం..
హై-ప్రోటీన్ డైట్ వల్ల గ్యాస్ ఎందుకు వస్తుంది?
జీర్ణం కావడానికి ఎక్కువ సమయం:
కార్బోహైడ్రేట్లతో పోలిస్తే ప్రోటీన్లు శరీరంలో నెమ్మదిగా జీర్ణమవుతాయి. జీర్ణవ్యవస్థపై ఒక్కసారిగా ఎక్కువ భారం పడినప్పుడు జీర్ణక్రియ మందగించి కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది.
ఫైబర్ లోపం
కేవలం ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలపైనే దృష్టి పెట్టి పీచు పదార్థాలను నిర్లక్ష్యం చేయడం వల్ల పేగుల కదలికలు తగ్గి మలబద్ధకం, గ్యాస్ తీవ్రమవుతాయి.
సల్ఫర్ అధికంగా ఉండటం
గుడ్లు, రెడ్ మీట్, సోయా, బీన్స్ వంటి ప్రోటీన్ ఆహారాలలో సల్ఫర్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణమయ్యే క్రమంలో దుర్వాసనతో కూడిన గ్యాస్ వెలువడేలా చేస్తుంది.
లాక్టోస్ - ఆర్టిఫిషియల్ స్వీట్నర్లు
వే ప్రోటీన్ లేదా ప్రోటీన్ పౌడర్లలో ఉండే లాక్టోస్ లేదా కృత్రిమ స్వీట్నర్లను శరీరం సరిగ్గా జీర్ణించుకోలేకపోయినప్పుడు గ్యాస్ సమస్య మరింత పెరుగుతుంది.
గ్యాస్, కడుపుబ్బరం రాకుండా పాటించాల్సిన చిట్కాలు
క్రమంగా పెంచండి
డైట్‌లో ప్రోటీన్ పరిమాణాన్ని ఒక్క రోజులోనే కాకుండా క్రమక్రమంగా పెంచుకుంటూ శరీరానికి అలవాటు చేయాలి.
తగినంత నీరు తాగండి
ప్రోటీన్ జీవక్రియ సక్రమంగా సాగడానికి శరీరానికి ఎక్కువ నీరు అవసరం. రోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం వల్ల టాక్సిన్లు తొలగిపోయి జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.
ఫైబర్‌ను జత చేయండి
ప్రోటీన్ తీసుకునే ప్రతి భోజనంలో సలాడ్లు, ఆకుకూరలు, కూరగాయలు లేదా చిరుధాన్యాలను చేర్చుకుంటే పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది.
సహజ జీర్ణ సహాయకాలు
భోజనం తర్వాత కొద్దిగా వాము, జీలకర్ర లేదా పుదీనా నీరు తీసుకోవడం, వంటల్లో అల్లం, వెల్లుల్లి, ఇంగువను వాడటం వల్ల గ్యాస్ రాకుండా అడ్డుకోవచ్చు..
ప్రోటీన్ రకాన్ని మార్చండి
వే ప్రోటీన్ లేదా పాల ఉత్పత్తుల వల్ల కడుపుబ్బరం వస్తుంటే ప్లాంట్-బేస్డ్ ప్రోటీన్ లేదా ఐసోలేట్ రూపాలను ఎంచుకోవడం మంచిది.

