Miscarriage: గర్భస్రావం తర్వాత త్వరగా కోలుకోవడానికి ఈ ఆహారాలు తినండి
ఈ ఆహారాలు తినండి

Miscarriage: గర్భస్రావం తర్వాత మహిళలు శారీరకంగా, మానసికంగా బలహీనపడతారు. ఈ సమయంలో శరీరం త్వరగా కోలుకోవడానికి, తిరిగి శక్తిని పొందడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పోషకాహారం తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా, రక్తహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. గర్భస్రావం తర్వాత తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ సి, ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు
శరీరంలో ఐరన్, విటమిన్ సి లోపం ఏర్పడకుండా ఉండటానికి ఈ పోషకాలు అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఇవి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించి, రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతాయి. అందుకోసం ఖర్జూరం, బాదం, పాలకూర, బంగాళాదుంపలు, క్యారెట్లు, సిట్రస్ పండ్లు, యాపిల్స్ వంటివి రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాలు
గర్భస్రావం తర్వాత శరీరం ఐరన్ లోపాన్ని ఎదుర్కొంటుంది. ఈ సమయంలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల రక్త కణాల స్థాయిలు పెరుగుతాయి. అంతేకాకుండా ఇది మానసిక ఒత్తిడి, నిరాశ నుండి కోలుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఈ సమయంలో బాదం, వాల్‌నట్స్, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
కాల్షియం, ధాన్యాలు
శరీరం త్వరగా కోలుకోవడానికి కాల్షియం చాలా అవసరం. గర్భస్రావం తర్వాత పాలు, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం ముఖ్యం. ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది.
అలాగే, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ధాన్యాలు సహాయపడతాయి. గర్భస్రావం తర్వాత వచ్చే జీర్ణ సమస్యలను తగ్గించడానికి ఓట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా వంటి ఆహారాలను చేర్చాలి. అదనంగా తగినంత పోషకాలు లభించడానికి చికెన్, చేపలను కూడా ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఈ ఆహార నియమాలు పాటించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని తిరిగి పొందవచ్చు.
