Balakrishna : అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి నేడు శంకుస్ధాపన
పాల్గొననున్న నందమూరి బాలకృష్ణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నేడు బుధవారం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి భవన నిర్మాణాలకు శంకుస్ధాపన చేయనున్నారు. ఆసుపత్రి చైర్మన్, హిందూపూర్ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ఈ నూతన ఆసుపత్రి భవనాలకు శంకుస్ధాపన చేయనున్నారు. దేశంలోనే క్యాన్సర్ చికిత్సలో ప్రఖ్యాతి గడించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్‌కి ఆంద్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతి లో క్యాన్సర్ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి భూమి కేటాయించిన సంగతి తెలిసిన విషయమే.
తాజాగా అమరావతి రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు గ్రామ సమీపంలో ఈరోజు బుదవారం 13 ఆగష్టు 2025 నాడు ఉదయం 9.30 గంటలకు సాంప్రదాయ పద్దతులలో పూజా కార్యక్రమాలు నిర్వహించి లాంఛనంగా హాస్పిటల్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. ఈ పూజా కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ తో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, వైసత్యకుమార్, శాసనసభ్యలు తెనాలి శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తదితరులు పాల్గొననున్నారు.
వీరితో పాటూ డా. దత్తాత్రేయుడు నోరి, డా. పోలవరపు రాఘవ రావు, డా. గడ్డం దశరథరామి రెడ్డి, జెయస్ ఆర్ ప్రసాద్, ఎంపీ శ్రీభరత్ మతుకిమిల్లి, బసవతారకం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు నారా బ్రాహ్మణి – తదితరులు కూడా ఈ శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు.
