Frequent Urination at Night: పగటిపూట కంటే రాత్రి వేళల్లో ఎక్కువగా యూరిన్‌కు వెళ్లడం చాలా మందిలో సాధారణంగా చూసే సమస్య. చలికాలంలోనో లేదా పడుకునే ముందు ఎక్కువ నీరు, టీ లేదా కాఫీ తాగడం వల్ల ఇలా జరగడం సహజమే. అయితే ఎలాంటి కారణం లేకుండా ప్రతిరోజూ రాత్రి వేళల్లో పదే పదే వాష్ రూమ్‌కు వెళ్లాల్సి వస్తుంటే మాత్రం దానిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్య పరిభాషలో ఈ సమస్యను నోక్టూరియాఅని పిలుస్తారు. ఇది శరీరంలో దాగి ఉన్న కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు ముందస్తు సంకేతం కావచ్చు.

రాత్రి వేళల్లో తరచుగా మూత్రవిసర్జన కావడానికి వెనుక ఉన్న 5 ప్రధాన ఆరోగ్య కారణాలు ఇవే..

డయాబెటిస్

శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగినప్పుడు, కిడ్నీలు ఆ అదనపు చక్కెరను శరీరం నుండి బయటకు పంపడానికి తీవ్రంగా శ్రమిస్తాయి. ఈ క్రమంలో రాత్రి వేళల్లో పదే పదే యూరిన్ రావడం మధుమేహం యొక్క ప్రాథమిక లక్షణం కావచ్చు.

కిడ్నీ సమస్యలు

మూత్రాన్ని వడపోసే కిడ్నీల పనితీరు మందగించినప్పుడు లేదా కిడ్నీ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు నోక్టూరియా సమస్య తలెత్తుతుంది. కిడ్నీ వ్యాధుల బారిన పడినప్పుడు రాత్రిపూట మూత్రవిసర్జన నియంత్రణ తప్పుతుంది.

ప్రోస్టేట్ సమస్యలు

వయసు పైబడిన పురుషులలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ప్రోస్టేట్ గ్రంథి పరిమాణం పెరగడం వల్ల మూత్రనాళంపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల రాత్రి వేళల్లో పదే పదే యూరిన్‌కు వెళ్లాల్సి వస్తుంది.

హై బ్లడ్ ప్రెషర్ - గుండె జబ్బులు

కొంతమందిలో అధిక రక్తపోటు లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు కూడా రాత్రి వేళల్లో శరీరంలో ద్రవాల సమతుల్యత దెబ్బతిని, తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంది.

జీవనశైలి పొరపాట్లు - ఇతర ఇన్ఫెక్షన్లు

రాత్రిపూట అధికంగా వేయించిన ఆహారాలు తినడం, పడుకునే ముందు కాఫీ లేదా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య పెరుగుతుంది. అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఈ ఇబ్బంది తప్పదు.

ఎప్పుడు అలర్ట్ అవ్వాలి?

రాత్రిపూట పదే పదే యూరిన్‌కు వెళ్లడంతో పాటు కింద పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి..

మూత్రవిసర్జన సమయంలో మంట లేదా నొప్పి పుట్టడం.

మూత్రంలో రక్తం పడటం.

నిద్ర తీవ్రంగా భంగం కావడం వల్ల అలసటగా అనిపించడం.

రాత్రిపూట తరచుగా వాష్ రూమ్‌కు వెళ్లడం వెనుక ఉన్న అసలు కారణాన్ని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవడం ఎంతో ముఖ్యం. రాత్రి వేళల్లో వేయించిన ఆహారాలను తగ్గించుకోవడం, పడుకునే ముందు కెఫిన్ పదార్థాలకు దూరంగా ఉండటంతో పాటు సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది.

PolitEnt Media

PolitEnt Media

Next Story