Getting Breathless While Climbing Stairs: చాలామందికి రెండు అంతస్తుల మెట్లు ఎక్కగానే విపరీతమైన ఆయాసం, అలసట వస్తుంటాయి. ఇది కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు, మీ శరీరంలోని గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలిపే ఒక సంకేతం. ఇలా ఎందుకు జరుగుతుంది? దీనిని అధిగమించే మార్గాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయాసం రావడానికి ప్రధాన కారణాలు

మెట్లు ఎక్కేటప్పుడు మన శరీరం గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పైకి కదలాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో సాధారణం కంటే ఎక్కువ శక్తి అవసరమవుతుంది.

ఆక్సిజన్ డిమాండ్: మెట్లు ఎక్కేటప్పుడు కాళ్ళ కండరాలు తీవ్రంగా శ్రమిస్తాయి, దీనివల్ల శరీరానికి ఆక్సిజన్ అవసరం పెరుగుతుంది.

అలవాటు లేకపోవడం: రోజూ వ్యాయామం చేయని వారిలో గుండె, ఊపిరితిత్తులు ఈ అదనపు ఒత్తిడిని తట్టుకోలేక త్వరగా అలసిపోతాయి.

ఇతర ఆరోగ్య సమస్యలు: అధిక రక్తపోటు, శ్వాసనాళాల్లో అడ్డంకులు, మితిమీరిన ఒత్తిడి లేదా వాతావరణంలోని దుమ్ము కూడా ఆయాసానికి కారణం కావచ్చు.

స్టామినా (ఓర్పు) పెంచుకోవడానికి చిట్కాలు

మీ ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడానికి నిపుణులు ఒక క్రమబద్ధమైన ప్రణాళికను సూచిస్తున్నారు..

మొదటి రెండు వారాలు: శరీరాన్ని సిద్ధం చేయడానికి రోజూ తేలికపాటి నడకను ప్రారంభించండి.

మూడవ వారం నుండి:

ఒక నిమిషం నడక తర్వాత 10 సెకన్ల పాటు తేలికపాటి జాగింగ్ చేయండి. ఇలా క్రమంగా జాగింగ్ సమయాన్ని పెంచుతూ ఉండాలి.

కార్డియో వ్యాయామాలు: ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడానికి సైక్లింగ్, ఈత, వేగంగా నడవడం లేదా హైకింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు చేయండి.

జిమ్ - జుంబా: ట్రెడ్‌మిల్ ఉపయోగించడం లేదా జుంబా క్లాసులకు వెళ్లడం ద్వారా కాలి కండరాలు దృఢంగా మారి, మెట్లు ఎక్కడం సులభం అవుతుంది.

ఎప్పుడు జాగ్రత్త పడాలి?

మెట్లు ఎక్కినప్పుడు కొద్దిపాటి ఆయాసం సహజమే అయినా, కొన్ని సందర్భాల్లో ఇది ప్రమాదకర సంకేతం కావచ్చు.

శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది కలగడం

విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పట్టడం.

గుండెలో నొప్పి లేదా విపరీతమైన దడ రావడం.

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే హృద్రోగ నిపుణుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

PolitEnt Media

PolitEnt Media

Next Story