Having a Daily Peg: రోజుకు ఒక పెగ్గు వేస్తున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి!
అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోండి!

Having a Daily Peg: మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ మాట మనం ప్రతిచోటా వింటూనే ఉంటాం. ప్రభుత్వం నెత్తీనోరూ బాదుకుని చెబుతున్నా, మద్యం ప్రియులు మాత్రం ‘మందేస్తూ చిందెయ్ రా.. చిందేస్తూ మందెయ్ రా’ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, సరదా కోసం మొదలుపెట్టే ఈ అలవాటు, వ్యసనంగా మారి.. ఏడాది పొడవునా రోజువారీగా మద్యం తాగితే అది యమ డేంజర్ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవం కాలేయం. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడమే కాకుండా, పోషకాలను శరీరానికి అందేలా సమన్వయం చేసేది ఇదే. కానీ, మీరు ప్రతిరోజూ మందు తాగుతుంటే.. మీ శరీరంలో 'అసిటాల్డిహైడ్' అనే విషపూరితమైన ఉప ఉత్పత్తి ఏర్పడుతుంది. ఇది నేరుగా కాలేయ కణాలపై దాడి చేసి, వాటిని దెబ్బతీస్తుంది. కాలేయం వాపుకు గురై, దాని పనితీరు క్రమంగా బలహీనపడుతుంది.
కాలేయం దెబ్బతింటున్నప్పుడు అది బయటకు ఎటువంటి ముందస్తు హెచ్చరికలు పంపదు. మీకు తెలియకుండానే లోపల నష్టం జరిగిపోతుంది. కాలేయ కణాల్లో విపరీతంగా కొవ్వు పేరుకుపోతుంది, దీన్నే 'ఫ్యాటీ లివర్' అంటారు. బయటకు ఎటువంటి లక్షణాలు కనిపించవు కాబట్టి చాలామంది దీనిని లైట్ తీసుకుంటారు. కానీ లోపల మీ ప్రాణానికి ముప్పు పొంచి ఉంటుందని గుర్తుంచుకోవాలి.
మద్యం కేవలం కాలేయాన్ని మాత్రమే కాదు, శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఇది క్యాన్సర్‌కు ప్రధాన కారకంగా మారుతుంది. మద్యం వల్ల హార్మోన్లు, ముఖ్యంగా ఈస్ట్రోజెన్ ప్రభావితమై మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతుంది. రోజుకు ఒక్క పెగ్గు తాగినా కూడా ఈ ప్రమాదం సుమారు 7 నుండి 10 శాతం వరకు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

