Betel Leaves: హిందూ సంప్రదాయంలో పూజలు, శుభకార్యాలలో తమలపాకుకు ఎంతో ప్రాధాన్యత ఉందనే విషయం మనందరికీ తెలిసిందే. ఆధ్యాత్మికంగానే కాకుండా ఆయుర్వేదంలో కూడా తమలపాకును ఒక శక్తివంతమైన మూలికగా ఉపయోగిస్తారు. భోజనం తర్వాత తాంబూలం వేసుకోవడం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు.. దాని వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తమలపాకులను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల శరీరానికి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

తమలపాకులతో కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు..

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

భోజనం చేసిన తర్వాత తమలపాకు నమలడం వల్ల లాలాజలం ఎక్కువగా ఊరుతుంది. ఇది ఆహారం సులభంగా అరగడానికి తోడ్పడుతుంది. కడుపు ఉబ్బరం, అసిడిటీ, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఇది తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.

తలనొప్పికి సహజమైన ఔషధం

తమలపాకులలో శోథ నిరోధక శీతలీకరణ గుణాలు ఉన్నాయి. విపరీతమైన తలనొప్పి ఉన్నప్పుడు తమలపాకు రసాన్ని నొసటిపై రాసుకున్నా లేదా లేత తమలపాకులను నుదుటిపై పెట్టుకున్నా తలనొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి

తమలపాకులను నమలడం వల్ల శరీరంలో ఆందోళనను తగ్గించే సమ్మేళనాలు విడుదలవుతాయి. ఇది నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచి, మానసిక ఒత్తిడి అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది.

నోటి దుర్వాసన, పంటి సమస్యలకు చెక్

తమలపాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిలోని హానికర బ్యాక్టీరియాను నశింపజేస్తాయి. దీనివల్ల నోటి దుర్వాసన తగ్గడమే కాకుండా చిగుళ్ళ వాపు, పంటి నొప్పులు తగ్గుతాయి. నోటిని తాజాగా ఉంచడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

జలుబు, దగ్గు నుంచి ఉపశమనం

చిన్నపిల్లల్లో లేదా పెద్దవారిలో జలుబు, ఛాతీలో కఫం పేరుకుపోయినప్పుడు తమలపాకుపై కొద్దిగా ఆవనూనె రాసి సన్నని సెగపై వేడి చేసి ఛాతీపై ఉంచితే కఫం కరిగి ఉపశమనం లభిస్తుంది. తమలపాకు రసంలో తేనె కలిపి తీసుకున్నా దగ్గు తగ్గుతుంది.

రక్తంలో సక్కెర స్థాయిల నియంత్రణ

కొన్ని అధ్యయనాల ప్రకారం తమలపాకులోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. మధుమేహం ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

పాటించాల్సిన జాగ్రత్తలు..

సున్నం, పొగాకు వద్దు:

తమలపాకు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ దానికి పొగాకు, జర్దా, అధికంగా సున్నం లేదా కృత్రిమ స్వీట్లను జత చేసి తీసుకోకూడదు.

పరిమితి ముఖ్యం:

రోజుకు 1 లేదా 2 లేత తమలపాకులను నేరుగా నమిలి తినడం లేదా తమలపాకు కషాయం, రసం రూపంలో తీసుకోవడం శ్రేయస్కరం.

PolitEnt Media

PolitEnt Media

Next Story