Heart Attack: ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గతంలో కేవలం వృద్ధులలో మాత్రమే ఎక్కువగా కనిపించే ఈ సమస్య, ఇప్పుడు యువకులను కూడా బలితీసుకుంటోంది. సాధారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయి, గుండెకు రక్త ప్రసరణ ఆగిపోతుందని, తద్వారా గుండెపోటు వస్తుందని మనకు తెలుసు.

కానీ కొలెస్ట్రాల్ స్థాయిలు పూర్తిగా సాధారణంగా ఉన్నప్పటికీ గుండెపోటు వచ్చే అవకాశం ఉందా? అంటే అవుననే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గుండె ఆరోగ్యం కేవలం కొలెస్ట్రాల్‌పై మాత్రమే ఆధారపడి ఉండదని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ స్పష్టం చేస్తోంది.

అధిక కొలెస్ట్రాల్ లేకపోయినా గుండెపోటుకు కారణాలు ఇవే..

మన జీవనశైలి, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా గుండెపోటుకు ప్రధాన కారణాలు కావచ్చు. వాటిలో ముఖ్యమైనవి..

తీవ్రమైన మానసిక ఒత్తిడి:

ప్రస్తుత కాలంలో పెరిగిపోతున్న మానసిక ఒత్తిడి గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది.

అధిక రక్తపోటు - మధుమేహం:

బీపీ, షుగర్ నియంత్రణలో లేకపోవడం వల్ల రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది.

ధూమపానం - వ్యాయామం లేకపోవడం: పొగతాగే అలవాటు ఉండటం, శారీరక శ్రమ అస్సలు లేకపోవడం.

కుటుంబ చరిత్ర : కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు ఉన్నట్లయితే, ఆ ప్రమాదం మరింత పెరుగుతుంది.

బరువు పెరగడం - అనారోగ్యకరమైన ఆహారం:

జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, ఊబకాయం కూడా దీనికి దారితీస్తాయి.

నిర్లక్ష్యం చేయకూడని ముందస్తు లక్షణాలు..

గుండెపోటు వచ్చే ముందు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. వీటిని సకాలంలో గుర్తించడం ప్రాణాలను కాపాడుతుంది..

ఛాతీలో తీవ్రమైన నొప్పి లేదా ఒత్తిడిగా అనిపించడం.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన అలసట.

హఠాత్తుగా తల తిరగడం.

ఛాతీ నుండి నొప్పి చేతులు, భుజాలు, మెడ లేదా దవడ భాగాలకు పాకడం.

గుండెను భద్రంగా ఉంచుకోవడానికి చిట్కాలు..

గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి నిపుణులు సూచిస్తున్న మార్గాలు..

సమతుల్య ఆహారం:

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం:

రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ లేదా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి.

నియంత్రణ పరీక్షలు:

బీపీ, చక్కెర మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమం తప్పకుండా డాక్టర్ ద్వారా పరీక్షించుకోవాలి.

ఒత్తిడి లేని జీవితం:

తగినంత నిద్రపోవడం, ధ్యానం లేదా యోగా ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story