Heart Attack Risks in Children: ఇటీవల బెంగళూరులోని పాఠశాలల్లో కొందరు విద్యార్థులు మైదానంలో ఆడుకుంటూ లేదా క్లాస్‌రూమ్‌లలో ఉన్నట్టుండి కుప్పకూలిపోవడం, కార్డియాక్ అరెస్ట్ అనుమానంతో ప్రాణాలు కోల్పోవడం తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వరుస ఘటనల నేపథ్యంలో బెంగళూరుకు చెందిన ప్రముఖ పిడియాట్రిక్ కార్డియాలజిస్టులు స్పందించారు. పిల్లల్లో గుండెపోటు రావడం అత్యంత అరుదని, దీనికి భయపడి ఆందోళన చెందడం కంటే ముందస్తు అవగాహన, అత్యవసర జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని వారు స్పష్టం చేశారు.

పెద్దలకు, పిల్లలకు వచ్చే గుండెపోటుకు తేడా ఏంటి?

వైద్యుల కథనం ప్రకారం.. పెద్దవారిలో రక్తం గడ్డకట్టడం లేదా ధమనుల్లో అడ్డంకుల వల్ల గుండెపోటు వస్తుంది. కానీ చిన్నారులలో ఇలా జరగదు.

పుట్టుకతో వచ్చే లోపాలు:

చిన్నారుల్లో జన్యుపరమైన హృదయ సంబంధిత సమస్యలు లేదా గుండె కొట్టుకునే వేగంలో వచ్చే మార్పుల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతాయి.

గుర్తించడం కష్టం:

చాలామంది పిల్లలు ఆరోగ్యంగానే కనిపిస్తారు. ఆటలాడుతున్నప్పుడు లేదా విపరీతమైన శారీరక శ్రమకు గురైనప్పుడు ఈ గుండె సమస్యలు ఒక్కసారిగా బయటపడతాయి.

జన్యుపరమైన ప్రభావం:

కుటుంబంలో ఎవరికైనా చిన్న వయసులోనే గుండెపోటు వచ్చిన చరిత్ర ఉంటే, పిల్లలకు కూడా ముందుగానే హెల్త్ చెకప్స్ చేయించడం మంచిది

.

లక్షణాలు ఎలా ఉంటాయి?

పిల్లలు ఆడుకునేటప్పుడు లేదా వ్యాయామం చేసేటప్పుడు క్రింది లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు..

ఆటలు ఆడుతున్నప్పుడు హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోవడం.

గుండె వేగంగా లేదా విచిత్రంగా కొట్టుకోవడం.

ఛాతీలో తీవ్రమైన నొప్పి లేదా ఊపిరి అందకపోవడం.

విపరీతమైన అలసట, మైకం రావడం.

పాఠశాలలు - సమాజం తీసుకోవాల్సిన చర్యలు:

మౌలిక సదుపాయాలు:

ప్రతి పాఠశాలలో అత్యవసర కార్డియాక్ ప్లాన్ ఉండాలి.

సీపీఆర్ శిక్షణ: గుండె ఆగిపోయిన 3 నిమిషాల్లో సీపీఆర్ అందించడం లేదా ఏఈడీ పరికరాన్ని ఉపయోగించడం వల్ల శాతానికి 700 శాతానికి పైగా ప్రాణాలను కాపాడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, సిబ్బందికి దీనిపై శిక్షణ ఇవ్వాలి.

ఈసీజీ పరీక్షలు:

పిల్లలను స్పోర్ట్స్ లేదా ఇతర శారీరక కార్యకలాపాల్లో చేర్పించే ముందు బేసిక్ ఈసీజీ పరీక్ష చేయించడం ద్వారా కొన్ని రకాల గుండె లోపాలను ముందే గుర్తించవచ్చు.

భయాందోళన వద్దు - సిద్ధంగా ఉండండి..

సంవత్సరానికి లక్ష మంది పిల్లల్లో కేవలం ఒకరిద్దరికి మాత్రమే ఇలాంటి అరుదైన గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు భరోసా ఇస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదని, బదులుగా సరైన సమయంలో స్పందించేలా సీపీఆర్ వంటి ప్రాథమిక చికిత్సలపై అవగాహన పెంచుకోవాలని స్పష్టం చేశారు.

Next Story