Heart Problems: ఇటీవలి కాలంలో పాఠశాలల్లో చిన్నారులు అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఢిల్లీలో మూడో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక ఆటల పీరియడ్ ముగించుకుని తరగతి గదికి వచ్చిన కొద్దిసేపటికే అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. ఉత్తరప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటన జరిగింది. దీంతో చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలు ఎందుకు వస్తున్నాయనే ప్రశ్న ముందుకు వచ్చింది.

సాధారణంగా గుండెపోటు పెద్దవారికే వస్తుందని భావిస్తారు. కానీ పిల్లలకూ గుండె సమస్యలు రావచ్చు. పుట్టుకతో వచ్చే గుండె లోపాలు, గుండె కండరాల వ్యాధులు, గుండె స్పందనలో అసాధారణ మార్పులు ఆకస్మిక ప్రమాదాలకు కారణమవుతాయి. కొన్నిసార్లు స్పష్టమైన లక్షణాలు కనిపించకపోయినా సమస్యలు ఉండవచ్చు. కుటుంబంలో చిన్న వయసులో ఆకస్మిక మరణాలు జరిగిన దాఖలాలు ఉన్నా, గుండె సంబంధిత వ్యాధుల చరిత్ర ఉన్నా పిల్లలకు వైద్య పరీక్షలు చేయించడం ముఖ్యం.


ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి

పిల్లలు ఆటలు ఆడుతున్నప్పుడు లేదా పరుగెత్తుతున్నప్పుడు తరచుగా స్పృహ కోల్పోవడం, ఛాతిలో నొప్పి, అసాధారణంగా శ్వాస తీసుకోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. శారీరక శ్రమ సమయంలో అకస్మాత్తుగా స్పృహ కోల్పోతే తప్పనిసరిగా పరీక్షలు చేయించాలి.


నివారణ చర్యలు

పిల్లలు ప్రతిరోజూ కనీసం ఒక గంటపాటు శారీరక కార్యకలాపాలు చేసేలా చూడాలి. సైకిల్ తొక్కడం, పరుగెత్తడం, ఈత, ఆటలు శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి. జంక్ ఫుడ్, అధిక చక్కెర ఉన్న ఆహారాలను తగ్గించి పండ్లు, కూరగాయలు, పప్పులు, తృణధాన్యాలు అందించాలి. మొబైల్, టీవీ ముందు ఎక్కువ సమయం గడపకుండా ఆటలకు ప్రాధాన్యం ఇవ్వాలి.పిల్లలు ఎక్కువ సమయం పాఠశాలల్లోనే గడుపుతారు. అందువల్ల అక్కడ అత్యవసర వైద్య సదుపాయాలు ఉండటం ముఖ్యం. ఉపాధ్యాయులు ప్రథమ చికిత్స, సీపీఆర్ (CPR) వంటి ప్రాణరక్షక విధానాలపై శిక్షణ పొందాలి. అకస్మాత్తుగా కుప్పకూలినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యసాయం అందించాలి.

Next Story