High Heel Craze: హైహీల్స్ క్రేజ్.. ఆరోగ్యానికి ముప్పేనా? ఎక్కువసేపు వేసుకుంటే శరీరంలో జరిగే మార్పులివే..
శరీరంలో జరిగే మార్పులివే..

High Heel Craze: మహిళల ఫ్యాషన్లో హైహీల్స్ది ప్రత్యేక స్థానం. స్టైలిష్ లుక్ ఇవ్వడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయన్న కారణంతో చాలామంది వీటిని ధరించేందుకు ఆసక్తి చూపుతారు. అయితే ఈ ఆకర్షణీయమైన పాదరక్షలు శరీర ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే విషయంపై ఎప్పుడైనా ఆలోచించారా? హైహీల్స్ ధరించడం వల్ల కలిగే ప్రభావం కేవలం పాదాలకే పరిమితం కాదని, శరీర సమతుల్యత, నడక తీరు, ఎముకలు, కండరాల పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
సమతుల్యత దెబ్బతింటుందా?
సాధారణ ఫ్లాట్ చెప్పులతో పోలిస్తే, హైహీల్స్ వేసుకున్నప్పుడు పాదం నేలపై ఆనే విధానం పూర్తిగా మారిపోతుంది. ఫలితంగా శరీర బరువు అసమతుల్యంగా పంపిణీ అవుతుంది. మరీ ముఖ్యంగా సన్నని మడమలు ఉన్న పాదరక్షలు నేలతో స్పర్శించే ఉపరితలం చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో శరీరాన్ని స్థిరంగా ఉంచడానికి చీలమండ, కండరాలు, కీళ్లు నిరంతరం తీవ్ర శ్రమ చేయాల్సి వస్తుంది. ఎగుడుదిగుడు రోడ్లు, మెట్లు ఎక్కేటప్పుడు లేదా జారే నేలపై నడిచేటప్పుడు అదుపుతప్పి పడిపోవడం లేదా చీలమండ బెణకడం వంటి ప్రమాదాలు పెరుగుతాయి. స్ప్రింగర్ నేచర్లో ప్రచురితమైన ఒక క్రమబద్ధమైన సమీక్ష ప్రకారం.. హైహీల్స్ ధరించడం మహిళల్లో స్థిర మరియు చలన సమతుల్యతను గణనీయంగా దెబ్బతీస్తుందని తేలింది.
శరీర భంగిమలో వచ్చే మార్పులు
హైహీల్స్ ధరించినప్పుడు మడమ పైకి లేవడంతో చీలమండపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. సమతుల్యత కోసం మోకాలు, తుంటి మరియు మొండెం ముందుకు లేదా వెనుకకు సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల వెన్నెముక కింది భాగంలో ఉండే సహజ వంపులో మార్పులు వచ్చి లంబార్ లార్డోసిస్ వంటి సమస్యలు తలెత్తే అవకాశముంది. ఎక్కువ సమయం వీటిని ధరించి నిలబడటం లేదా నడవడం వల్ల వెన్ను కండరాలు తీవ్ర అలసటకు గురై దీర్ఘకాలిక నడుము నొప్పికి దారితీస్తాయి.
తుంటి, కండరాలపై అదనపు భారం
హైహీల్స్ వాడకం వల్ల శరీర బరువును మోసే సహజమైన నడక విధానం మారిపోతుంది. సైన్స్డైరెక్ట్ అధ్యయనం ప్రకారం.. మొండెం, తుంటి కండరాల మధ్య ఉండాల్సిన సహజ సమన్వయం దెబ్బతింటుంది. ఫలితంగా తుంటి కీళ్లు, తొడ కండరాలు విపరీతమైన ఒత్తిడికి గురవుతాయి. ఇది క్రమంగా కండరాల అలసటకు, తుంటి నొప్పులకు కారణమవుతుంది.
పాదరక్షల ఎంపికలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఫ్యాషన్ ముఖ్యం అయినప్పటికీ, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
రోజంతా నిలబడాల్సిన, ఎక్కువ దూరం నడవాల్సిన సందర్భాల్లో వీలైనంత వరకు హైహీల్స్ వాడకాన్ని తగ్గించాలి.
తప్పనిసరిగా వేసుకోవాల్సి వస్తే.. సరైన సైజు, వెడల్పాటి మడమ ఉండి, నేలపై మంచి పట్టునిచ్చే పాదరక్షలను ఎంచుకోవాలి.
మధ్యమధ్యలో హీల్స్ తీసి పాదాలకు విశ్రాంతి ఇవ్వడం అలవాటు చేసుకోవాలి.
ఒకవేళ హైహీల్స్ వాడిన తర్వాత నడుము, మోకాలు, తుంటి లేదా చీలమండలంలో తరచూ తీవ్రమైన నొప్పి వస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.

