Hungry Again Right After Eating: భోజనం చేసిన కాసేపటికే మళ్లీ ఏదో ఒకటి తినాలనిపించడం చాలామందిలో కనిపిస్తుంది. కొందరు దీనిని సహజమైన అలవాటుగా భావించి తేలిగ్గా తీసుకుంటారు. కానీ, కడుపు నిండా తిన్నా కూడా మాటిమాటికీ తీవ్రమైన ఆకలి వేస్తుంటే అది అంతర్లీన ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని డెహ్రాడూన్ కైలాష్ ఆసుపత్రి సీనియర్ డైటీషియన్ డాక్టర్ పాయల్ దత్ హెచ్చరిస్తున్నారు. వైద్య పరిభాషలో ఇలా అసాధారణంగా ఆకలి వేసే స్థితిని పాలీఫేజియా అంటారు.

నిరంతరం ఆకలి వేయడానికి ప్రధాన కారణాలు..

మధుమేహం

శరీరంలోని కణాలు రక్తంలోని గ్లూకోజ్‌ను సరైన రీతిలో శక్తిగా మార్చుకోలేనప్పుడు, మెదడుకు శక్తి కొరత ఉన్నట్లు సంకేతాలు వెళ్లి మాటిమాటికీ తీవ్రమైన ఆకలి వేస్తుంది.

లో బ్లడ్ షుగర్:

రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోయినప్పుడు తీవ్రమైన ఆకలితో పాటు చేతులు వణకడం, గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

హైపర్‌థైరాయిడిజం:

థైరాయిడ్ గ్రంథి అధికంగా పనిచేసినప్పుడు శరీర మెటబాలిజం వేగవంతమై క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. దీనివల్ల శరీరం వెంటనే ఆహారాన్ని డిమాండ్ చేస్తుంది.

తీవ్రమైన మానసిక ఒత్తిడి:

ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో కార్టిసాల్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది ఆహారంపై, ముఖ్యంగా తీపి లేదా జంక్ ఫుడ్‌పై కోరికలను విపరీతంగా పెంచుతుంది.

నిద్రలేమి:

రోజుకు సరిపడా నిద్ర లేకపోతే ఆకలిని నియంత్రించే లెప్టిన్, గ్రెలిన్ హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని కడుపు నిండిన భావన కలగదు.

పోషకాహార లోపం:

తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు లేకపోతే, ఎంత తిన్నా శరీరానికి అవసరమైన పోషణ అందక మళ్లీ మళ్లీ ఆకలి వేస్తుంది.

హార్మోన్ల మార్పులు:

మహిళల్లో పీరియడ్స్‌కు ముందు శరీరంలో జరిగే హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల క్రేవింగ్స్ పెరుగుతాయి.

ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?

ఎక్కువగా తింటున్నప్పటికీ శరీర బరువు వేగంగా తగ్గడం, గొంతు ఎండిపోయి విపరీతంగా దాహం వేయడం, మాటిమాటికీ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ఈ సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన రక్త పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story