Ignoring a Sore Throat: గొంతు నొప్పిని లైట్ తీసుకుంటున్నారా?.. ఈ లక్షణాలు ఉంటే వెంటనే అలర్ట్ అవ్వండి..
ఈ లక్షణాలు ఉంటే వెంటనే అలర్ట్ అవ్వండి..

Ignoring a Sore Throat: ప్రస్తుత కాలంలో చిన్నపాటి జలుబు చేసినా, గొంతులో నలతగా ఉన్నా చాలామంది సొంత వైద్యం చేసుకుంటుంటారు. మెడికల్ షాపులకు వెళ్లి యాంటీబయాటిక్స్ వాడేస్తుంటారు. అయితే, వారాల తరబడి తగ్గని గొంతు నొప్పి కేవలం జలుబు మాత్రమే కాదని, అది ప్రాణాంతకమైన గొంతు క్యాన్సర్ లక్షణం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాధారణ జలుబుకు, క్యాన్సర్‌కు తేడా ఏంటి?
గొంతు క్యాన్సర్ లక్షణాలు ప్రారంభంలో సాధారణ ఫ్లూ మాదిరిగానే కనిపిస్తాయి. అందుకే చాలామంది వీటిని గుర్తించడంలో పొరపాటు పడతారు. ఈ కింది లక్షణాలు ఉంటే మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకూడదు..
గొంతు బొంగురుపోవడం: గొంతు స్వరం మారడం లేదా బొంగురుపోవడం అనేది అత్యంత ముఖ్యమైన లక్షణం.
మింగడంలో ఇబ్బంది: ఆహారం తీసుకుంటున్నప్పుడు నొప్పిగా ఉండటం లేదా గొంతులో ఏదో ఇరుక్కుపోయినట్లు అనిపించడం.
మెడపై గడ్డలు: మెడకు ఇరువైపులా నొప్పి లేని చిన్న చిన్న గడ్డలు లేదా వాపులు కనిపించడం.
తగ్గని దగ్గు:
మందులు వాడినా వారాల తరబడి దగ్గు లేదా గొంతు నొప్పి తగ్గకపోవడం.
ప్రమాదం ఎవరికి ఎక్కువ?
నేటి ఆధునిక జీవనశైలి కారణంగా మహిళల్లోనూ, పురుషుల్లోనూ ఈ వ్యాధి ప్రమాదం పెరుగుతోంది.
పొగాకు ఉత్పత్తులు:
సిగరెట్లు తాగడం లేదా పొగాకు నమలడం వల్ల గొంతు కణాలు దెబ్బతింటాయి.
మద్యం: అతిగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుంది.
వైరల్ ఇన్ఫెక్షన్లు:
వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం వల్ల వచ్చే HPV వంటి సంక్రమణలు కూడా ఒక కారణం.
ప్రారంభంలో గుర్తిస్తే నయం చేయవచ్చు!
ఇతర క్యాన్సర్లతో పోలిస్తే గొంతు క్యాన్సర్ విషయంలో ఒక మంచి విషయం ఏమిటంటే.. దీనిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే నిపుణుడైన వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.
వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
పొగాకుకు స్వస్తి: సిగరెట్, బీడీ లేదా పొగాకు నమలడం వంటి అలవాట్లను వెంటనే మానుకోవాలి.
మద్యం నియంత్రణ: ఆల్కహాల్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలి.
సరైన ఆహారం:
విటమిన్లు అధికంగా ఉండే తాజా పండ్లు, ఆకుకూరలను డైట్‌లో చేర్చుకోవాలి.
పరిశుభ్రత:
వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, అవసరమైన టీకాలు వేయించుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ పొందవచ్చు.
ముందస్తు గుర్తింపు - సంపూర్ణ ఆరోగ్యం. గొంతులో అసౌకర్యంగా ఉన్నప్పుడు సొంత వైద్యంతో కాలక్షేపం చేయకుండా, నిపుణుల సలహా తీసుకోవడమే ఉత్తమం.

