Iodine Deficiency: మన వంటింట్లో రోజూ వాడే పదార్థాల్లో ఉప్పు అత్యంత ముఖ్యమైనది. అయితే రోజూ మనం వంటల్లో వాడే ఉప్పులో శరీరానికి అవసరమైన అయోడిన్ తగినంత మోతాదులో ఉంటోందా లేదా అనేది గమనించడం అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం. శరీర ఎదుగుదల, జీవక్రియలు, మెదడు పనితీరు సరిగ్గా ఉండటానికి అయోడిన్ కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేసి హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి అయోడిన్ ఖచ్చితంగా అవసరం. ఈ పోషకం లోపిస్తే అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయోడిన్ లోపిస్తే వచ్చే ప్రధాన సమస్యలు

గొంతు వాపు

శరీరంలో అయోడిన్ తగినంత లేనప్పుడు థైరాయిడ్ గ్రంథి అసాధారణంగా ఉబ్బిపోతుంది. దీన్నే గాయిటర్ లేదా గొంతు వాపు సమస్య అంటారు.

థైరాయిడ్ పనితీరులో లోపాలు

అయోడిన్ కొరత వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల తీవ్రమైన నీరసం, అలసట, శరీర బరువు వేగంగా పెరగడం, తీవ్రమైన చలిని తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

పిల్లల్లో ఎదుగుదల లోపం

పిల్లల మెదడు వికాసానికి, శారీరక ఎదుగుదలకు అయోడిన్ అత్యవసరం. దీని లోపం వల్ల జ్ఞాపకశక్తి, గ్రహణ సామర్థ్యం దెబ్బతిని మానసిక ఎదుగుదల మందగించే ప్రమాదం ఉంది.

గర్భధారణ సమయంలో ప్రమాదం

గర్భిణుల్లో అయోడిన్ కొరత ఏర్పడితే కడుపులోని పిండం మెదడు, నాడీ వ్యవస్థల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుంది.

రోజుకు ఎంత అయోడిన్ అవసరం?

సాధారణ పెద్దలకు: రోజుకు సుమారు 150 మైక్రోగ్రాములు

గర్భిణులకు: రోజుకు సుమారు:220 మైక్రోగ్రాములు

పాలిచ్చే తల్లులకు: రోజుకు సుమారు 290 మైక్రోగ్రాములు

అయోడైజ్డ్ ఉప్పుతో పాటు పాలు, పెరుగు, గుడ్లు, సముద్ర ఆహారం ద్వారా కూడా శరీరానికి సహజంగా అయోడిన్ లభిస్తుంది.

నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలు

ప్యాకెట్ పరిశీలించండి:

ఉప్పు కొనుగోలు చేసే సమయంలో ప్యాకెట్‌పై అయోడైజ్డ్ సాల్ట్ అని స్పష్టంగా ఉందో లేదో తనిఖీ చేయండి.

భద్రపరిచే విధానం:

ఉప్పులోని అయోడిన్ నాణ్యత దెబ్బతినకుండా ఉండాలంటే తేమ తగలకుండా గాలి చొరబడని డబ్బాలో మూతపెట్టి భద్రపరచాలి.

ఉప్పును ఎక్కువగా తీసుకోకండి:

అయోడిన్ అందుతుంది కదా అని ఉప్పును మోతాదుకు మించి వాడకూడదు. అతిగా ఉప్పు తీసుకుంటే అధిక రక్తపోటు (బీపీ), గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

సొంత వైద్యం వద్దు:

వైద్యుల సలహా లేకుండా నేరుగా అయోడిన్ సప్లిమెంట్ మాత్రలు వాడరాదు. అయోడిన్ లోప లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది.

Next Story