6 Hours of Sleep Enough: 6 గంటల నిద్ర సరిపోతుందా? తక్కువ నిద్రతో మెదడుకు కలిగే ముప్పు ఇదే!
తక్కువ నిద్రతో మెదడుకు కలిగే ముప్పు ఇదే!

6 Hours of Sleep Enough: చాలామంది రాత్రిపూట ఆరు గంటలు నిద్రపోతే సరిపోతుందని, తాము రోజంతా ఉత్సాహంగానే ఉన్నామని అనుకుంటూ ఉంటారు. కానీ వైద్య నిపుణులు మాత్రం ఇది కేవలం ఒక భ్రమ మాత్రమేనని హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ఒక వ్యక్తి రోజుకు 7 నుండి 9 గంటల పాటు ఖచ్చితంగా నిద్రపోవాలి. ఎప్పుడైతే మనం రెండు వారాల పాటు వరుసగా కేవలం 6 గంటలే నిద్రపోతామో, మన మెదడు పనితీరులో భారీ మార్పులు వస్తాయి. పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతుందంటే, రెండు రోజుల పాటు అస్సలు నిద్రలేని వ్యక్తి మెదడు ఎంత మందకొడిగా పనిచేస్తుందో, రోజుకు 6 గంటలే పడుకునే వ్యక్తి మెదడు కూడా అదే స్థాయికి పడిపోతుంది.
ఇక్కడ అసలైన ప్రమాదం ఏమిటంటే, మన మెదడు పనితీరు తగ్గుతున్న విషయం మనకు తెలియకపోవడమే. నిద్ర తక్కువైనప్పుడు ఏకాగ్రత దెబ్బతింటుంది, జ్ఞాపకశక్తి మందగిస్తుంది. ముఖ్యంగా ఏదైనా క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మెదడు మొద్దుబారిపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. రోజువారీ పనుల్లో కూడా చురుకుదనం తగ్గిపోతుంది. నిద్ర లేకపోవడం వల్ల మెదడులో పేరుకుపోయే మలినాలు సరిగ్గా శుభ్రం కావు, దీనివల్ల దీర్ఘకాలంలో ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయి.
మెదడు తనను తాను రీఛార్జ్ చేసుకుని మళ్ళీ చురుగ్గా పని చేయాలంటే కనీసం 7 గంటలకు పైగా గాఢ నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. నిద్రను కేవలం విశ్రాంతిగా మాత్రమే కాకుండా, శరీరానికి మరియు మెదడుకు ఇచ్చే ఒక ముఖ్యమైన 'సర్వీసింగ్' లాగా భావించాలి. అందుకే ఆరోగ్యం విషయంలో రాజీ పడకుండా రోజూ తగినంత సమయం నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మన మెదడు ఆరోగ్యంగా ఉండి, మనం తీసుకునే నిర్ణయాలు సరైన ఫలితాలను ఇస్తాయి.

