Thalassemia Dangerous: థలసేమియా ప్రమాదకరమా? పెళ్లి, గర్భధారణకు ముందే పరీక్షలు ఎందుకు ముఖ్యం?
పెళ్లి, గర్భధారణకు ముందే పరీక్షలు ఎందుకు ముఖ్యం?

Thalassemia Dangerous: నేటి కాలంలో పిల్లలను వేధిస్తున్న అత్యంత తీవ్రమైన ఆరోగ్య సమస్యల్లో థలసేమియా ఒకటి. ఇది ఒక ప్రమాదకరమైన జన్యుపరమైన రక్త రుగ్మత. ఇది జన్యువుల ద్వారా తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమిస్తుంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం వేలాది మంది పిల్లలు థలసేమియా మేజర్ తో జన్మిస్తున్నారు. ప్రారంభ దశలో లక్షణాలు స్పష్టంగా తెలియకపోవడం వల్ల చాలామంది దీనిని సాధారణ రక్తహీనత అని పొరబడి నిర్లక్ష్యం చేస్తుంటారు.
అసలు థలసేమియా అంటే ఏమిటి?
మానవ శరీరంలో ఎర్ర రక్త కణాలకు అవసరమైన హిమోగ్లోబిన్ తగినంత మోతాదులో ఉత్పత్తి కాకపోవడమే ఈ వ్యాధికి ప్రధాన కారణం. హిమోగ్లోబిన్ లోపం ఏర్పడినప్పుడు శరీర భాగాలకు ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగదు. దీనివల్ల పిల్లలు తీవ్రమైన నీరసానికి గురవడమే కాకుండా, వారి శారీరక ఎదుగుదల పూర్తిగా దెబ్బతింటుంది.
పిల్లలలో కనిపించే ప్రధాన లక్షణాలు..
నిరంతర అలసట, విపరీతమైన బలహీనత.
చర్మం తెల్లబడటం లేదా పాలిపోవడం.
వయసుకు తగ్గ బరువు, ఎత్తు పెరగకపోవడం.
తరచుగా జ్వరం రావడం, ఇన్‌ఫెక్షన్ల బారిన పడటం.
ఆహారం తినడానికి అస్సలు ఆసక్తి చూపించకపోవడం.
వ్యాధి తీవ్రత పెరిగితే ముఖ ఎముకల నిర్మాణంలో మార్పులు రావడం.
థలసేమియా ఎంత ప్రమాదకరం?
సమయానికి గుర్తించి చికిత్స అందించకపోతే థలసేమియా మేజర్ ప్రాణాంతకంగా మారవచ్చు. ఇది గుండె, కాలేయం వంటి శరీరంలోని కీలక అవయవాలను దెబ్బతీస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన పిల్లలకు జీవితాంతం క్రమం తప్పకుండా రక్త మార్పిడి చేయాల్సి ఉంటుంది.
నివారణే ఏకైక మార్గం: పెళ్లికి ముందే స్క్రీనింగ్..
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం. .తల్లిదండ్రులిద్దరూ థలసేమియా వాహకులు అయితే, పుట్టబోయే బిడ్డకు ఈ వ్యాధి వచ్చే అవకాశం 25% ఉంటుంది. అందుకే వివాహానికి ముందు లేదా గర్భధారణకు ముందు దంపతులు ఒక సాధారణ రక్త పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. జన్యుపరమైన కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా రాబోయే తరాలకు ఈ మహమ్మారి సోకకుండా ముందే అడ్డుకోవచ్చు.
అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సలు..
ప్రస్తుతం వైద్య రంగంలో వచ్చిన పురోగతి వల్ల థలసేమియా బాధితులకు మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
క్రమం తప్పకుండా రక్త మార్పిడి చేయడం.
శరీరంలో ఐరన్ శాతాన్ని నియంత్రించే మందులు వాడటం.
కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఎముక మజ్జ మార్పిడి ద్వారా శాశ్వత పరిష్కారం చూపడం.
భవిష్యత్తులో ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేలా జన్యు చికిత్సపై పరిశోధనలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి.
- ThalassemiaGenetic DisorderBlood DisorderHealth AwarenessPre Marital ScreeningPregnancy PlanningMaternal HealthGenetic TestingPreventive HealthcareFamily PlanningHealth TipsMedical AwarenessWomen’s HealthChild HealthPublic HealthEarly DiagnosisLatest Telugu NewsHealth UpdatesHealthcare EducationPrenatal CareDisease Prevention

