Real Secret Behind Kidney Stones: కిడ్నీ రాళ్ల వెనుక అసలు గుట్టు ఇదా? షాకింగ్ నిజాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు
షాకింగ్ నిజాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు

Real Secret Behind Kidney Stones: కిడ్నీలో రాళ్లు.. వినడానికి చిన్న సమస్యలా అనిపించినా, అది కలిగించే నరకం అంతా ఇంతా కాదు. సాధారణంగా మన మూత్రంలోని ఖనిజ లవణాలు పేరుకుపోవడం వల్లే ఈ రాళ్లు ఏర్పడతాయని ఇప్పటివరకు అందరూ అనుకునేవారు. కానీ, తాజాగా జరిగిన ఒక పరిశోధన ఈ విషయంలో మనకు తెలిసిన పాత విషయాలను పూర్తిగా సవాల్ చేస్తోంది.
సాధారణంగా కిడ్నీలో 'క్యాల్షియం ఆక్సలేట్' రకం రాళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే, తాజాగా శాస్త్రవేత్తలు అత్యాధునిక మైక్రోస్కోపుల ద్వారా ఈ రాళ్లను పరిశీలించగా ఒక షాకింగ్ విషయం బయటపడింది. మనకు కేవలం రసాయనాలుగా కనిపించే ఈ రాళ్ల లోపల బ్యాక్టీరియా వ్యవస్థీకృతమై, గూడు కట్టుకుని ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అవును.. మనం కేవలం భౌతిక ప్రక్రియ అనుకున్న ఈ రాళ్ల వెనుక బ్యాక్టీరియా హస్తం కూడా ఉందని తేలింది.
శస్త్రచికిత్స ద్వారా తొలగించిన రాళ్లను పరిశీలించినప్పుడు, మూత్ర ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారిలోనే కాకుండా, లేనివారి రాళ్లలో కూడా బ్యాక్టీరియా ఉన్నట్లు గమనించారు. ఈ బ్యాక్టీరియా సమూహాలు ఒకచోట చేరి 'బయోఫిల్మ్'గా ఏర్పడుతున్నాయి. ఈ బయోఫిల్మ్ విడుదల చేసే రసాయనాలే.. మూత్రంలోని ఖనిజ లవణాలు ఒక దగ్గర పోగుపడేలా చేసి, అవి రాయిగా మారడానికి పురికొల్పుతున్నాయని పరిశోధకులు ప్రాథమికంగా నిర్ధారించారు.
కిడ్నీ రాళ్లు కేవలం రసాయనాల వల్ల ఏర్పడతాయన్న పాత సిద్ధాంతానికి ఈ తాజా అధ్యయనం ఒక సవాల్ విసిరింది. రాళ్ల లోపల బ్యాక్టీరియా పాత్ర ఇంత కీలకమని తెలియడం వల్ల, భవిష్యత్తులో కిడ్నీ రాళ్ల నివారణకు చికిత్సకు సరికొత్త మార్గాలు దొరికే అవకాశం ఉంది. అంటే, కేవలం రాళ్లను కరిగించడమే కాకుండా, ఆ బ్యాక్టీరియాను అరికట్టడం ద్వారా మళ్లీ మళ్లీ రాళ్లు ఏర్పడకుండా చూడొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

