Vitamin D Deficiency: మీ వెన్నునొప్పికి కారణం అదేనా? విటమిన్ డి లోపంపై షాకింగ్ నిజాలు!
విటమిన్ డి లోపంపై షాకింగ్ నిజాలు!

Vitamin D Deficiency: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 171 కోట్ల మంది దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడుతున్నారని శాన్ ఫ్రాన్సిస్కో విశ్వవిద్యాలయ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో సుమారు 80 శాతం మంది మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ వెన్నునొప్పికి కేవలం శారీరక శ్రమ లేదా వయస్సు మాత్రమే కారణం కాదని, శరీరంలో ఒక ముఖ్యమైన విటమిన్ లోపం కూడా ప్రధాన కారణం కావచ్చని సరికొత్త పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 'క్యూరియస్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, విటమిన్ డి లోపానికి మరియు వెన్నునొప్పి తీవ్రతకు మధ్య బలమైన సంబంధం ఉన్నట్లు తేలింది.
విటమిన్ డి అనేది మన శరీరంలో ఎముకలు మరియు కండరాల ఆరోగ్యానికి అత్యంత అవసరమైన పోషకం. శరీరంలో ఇతర పోషకాలను గ్రహించాలన్నా విటమిన్ డి ఉండాల్సిందే. ప్రస్తుత కాలంలో చాలా మంది ఎక్కువుగా ఇళ్లలోనే గడపడం, సూర్యరశ్మి తగలకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ లోపం తలెత్తుతోంది. విటమిన్ డి స్థాయిలు తగ్గడం వల్ల కేవలం వెన్నునొప్పి రావడమే కాకుండా, రోజువారీ పనులు చేసుకోలేకపోవడం మరియు పని సామర్థ్యం తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు.
దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడుతున్న వయోజనులపై జరిపిన ఈ అధ్యయనంలో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. శరీరంలో విటమిన్ డి స్థాయిలు ఏమాత్రం తక్కువగా ఉన్నా, వారిలో నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటోందని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా తీవ్రమైన విటమిన్ డి లోపం ఉన్నవారు నడవడానికి లేదా కనీస పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు గమనించారు. వాతావరణం ఎలా ఉన్నప్పటికీ, ప్రతిరోజూ కొంతసేపు సూర్యరశ్మి తగిలేలా చూసుకోవడం మరియు విటమిన్ డి పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా ఈ వెన్నునొప్పి సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

