Vision Becoming Blurry: కంటి చూపు మసకబారుతోందా? అయితే నిర్లక్ష్యం వద్దు.. ఆ తీవ్రమైన వ్యాధులకు సంకేతం కావచ్చు..
వ్యాధులకు సంకేతం కావచ్చు..

Vision Becoming Blurry: ఈ రోజుల్లో కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌ల వాడకం విపరీతంగా పెరిగిపోవడం వల్ల కళ్లు అలసిపోవడం, చూపు కాస్త మసకబారడం సర్వసాధారణంగా మారిపోయింది. చాలామంది దీనిని కేవలం అలసటగా భావించి లైట్ తీసుకుంటారు లేదా డ్రాప్స్ వేసుకుని సరిపెట్టుకుంటారు. కానీ, తరచూ చూపు మసకబారడం అనేది కేవలం కళ్లకు సంబంధించిన సమస్య మాత్రమే కాకపోవచ్చు. ఇది శరీరంలోని ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు ముందస్తు హెచ్చరిక కావచ్చునని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చూపు మసకబారడానికి దారితీసే కొన్ని ముఖ్యమైన కారణాలు మరియు ఆరోగ్య పరిస్థితులు ఇవే..
డయాబెటిస్ :
రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పినప్పుడు, అది కంటిలోని రక్తనాళాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల కంటి లెన్స్ వాపునకు గురై చూపు మసకబారుతుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే డయాబెటిక్ రెటినోపతీ అనే తీవ్రమైన కంటి సమస్యకు దారితీసి, శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.
హైబీపీ :
రక్తపోటు విపరీతంగా పెరిగినప్పుడు కంటికి రక్తాన్ని సరఫరా చేసే సన్నటి రక్తనాళాలు దెబ్బతింటాయి. దీనివల్ల రెటినాకు నష్టం వాటిల్లి చూపు మసకబారడం, వస్తువులు సరిగ్గా కనిపించకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
స్ట్రోక్ వచ్చే ముందస్తు సంకేతం:
మెదడులోని ఒక భాగానికి రక్తప్రసరణ ఆగిపోయినప్పుడు లేదా రక్తనాళం పగిలినప్పుడు స్ట్రోక్ వస్తుంది. ఒకవేళ హఠాత్తుగా ఒక కన్ను లేదా రెండు కళ్ల చూపు మసకబారడం, దాంతో పాటు మాట తడబడడం, ముఖం లేదా చేతులు మొద్దుబారడం వంటి లక్షణాలు కనిపిస్తే అది బ్రెయిన్ స్ట్రోక్‌కు సంకేతం కావచ్చు. ఇలాంటి సమయంలో క్షణం కూడా ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం అందించాలి.
మైగ్రేన్ తలనొప్పి:
తీవ్రమైన మైగ్రేన్ సమస్య ఉన్నవారిలో తలనొప్పి ప్రారంభం కావడానికి ముందు లేదా నొప్పి వస్తున్న సమయంలో కంటి చూపు మసకబారడం, కళ్ల ముందు మెరుపులు మెరిసినట్లు అవ్వడం లేదా చుక్కలు కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కంటి ఇన్ఫెక్షన్లు - ఇతర సమస్యలు:
కంటిపై ఉండే నల్లగుడ్డు దెబ్బతినడం, కళ్లల్లో ఇన్ఫెక్షన్లు రావడం, లేదా కంటి లోపలి ఒత్తిడి పెరగడం వల్ల కూడా చూపు మసకబారుతుంది.
ఎప్పుడు అలర్ట్ అవ్వాలి?
హఠాత్తుగా చూపు మసకబారడం
చూపు మసకబారడంతో పాటు తీవ్రమైన తలనొప్పి, కంటినొప్పి లేదా వాంతులు అవ్వడం.
ఒక కన్ను పూర్తిగా కనిపించకుండా పోవడం

