Kidney Failure at a Young Age: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్లు యువత ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఒకప్పుడు వృద్ధాప్యంలో మాత్రమే కనిపించే కిడ్నీ సమస్యలు, ఇప్పుడు చిన్న వయసు వారిలోనే ఎక్కువగా బయటపడుతున్నాయి. రక్తపోటు, మధుమేహం, పెరిగిన బరువు వంటి సమస్యలు కిడ్నీ పనితీరును నెమ్మదిగా దెబ్బతీస్తాయి. ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే కిడ్నీలను నిర్వీర్యం చేసే 4 ప్రధాన ‘సైలెంట్ కిల్లర్స్ వాటి నివారణ మార్గాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

ప్రాసెస్డ్ ఫుడ్స్ - అధిక చక్కెర వాడకం

మైదాతో చేసిన ఆహారాలు, స్వీట్లు, కేకులు, పేస్ట్రీల వంటి ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను అతిగా తీసుకోవడం వల్ల శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు, బరువు వేగంగా పెరుగుతాయి. ఇది దీర్ఘకాలంలో కిడ్నీలపై తీవ్ర ఒత్తిడిని కలిగించి వాటి వడపోత వ్యవస్థను దెబ్బతీస్తుంది.

చిట్కా: నిత్య ఆహారంలో చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించి సమతుల్య పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.

ఎక్కువ సమయం ఒకే చోట కూర్చోవడం

గంటల తరబడి కదలకుండా ఒకే చోట కూర్చొని పనిచేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మందగిస్తుంది, జీవక్రియల వేగం తగ్గుతుంది, రక్తపోటు పెరుగుతుంది. ఇది క్రమంగా మూత్రపిండాల పనితీరును బలహీనపరుస్తుంది.

చిట్కా: ప్రతి 30 నిమిషాలకోసారి లేచి కాసేపు నడవడం, చిన్నపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి.

అధిక ఉప్పు (సోడియం) వినియోగం

ఆహారంలో ఉప్పు మోతాదు పెరిగితే అది నేరుగా రక్తపోటుపై ప్రభావం చూపిస్తుంది. కూరల్లో వేసే ఉప్పు మాత్రమే కాకుండా... చిప్స్, ప్యాక్డ్ స్నాక్స్, సాస్‌లు, ఇన్‌స్టంట్ ఫుడ్స్‌లో ఉండే అధిక సోడియం కిడ్నీ కణజాలాన్ని నెమ్మదిగా పాడు చేస్తుంది.

చిట్కా: ప్యాక్డ్, ప్రాసెస్డ్ స్నాక్స్ తగ్గించి, రోజువారీ ఉప్పు వినియోగాన్ని పరిమితం చేయాలి.

సరిపడా నీరు తాగకపోవడం

శరీరంలోని వ్యర్థాలను, విష పదార్థాలను (టాక్సిన్స్) బయటకు పంపడానికి కిడ్నీలకు తగినంత నీరు అవసరం. తక్కువ నీరు తాగినప్పుడు వ్యర్థాల వడపోత కష్టమై రాళ్లు ఏర్పడటం లేదా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

చిట్కా: రోజుకు తగిన పరిమాణంలో మంచినీరు తాగాలి. అలాగే ఏడాదికి ఒకసారైనా సాధారణ కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం మంచిది.

PolitEnt Media

PolitEnt Media

Next Story