Leg Tingling and Discomfort: కాళ్లలో తిమ్మిర్లు, అసౌకర్యం? నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!
ప్రమాదమే!

Leg Tingling and Discomfort: రాత్రిపూట పడుకోగానే కాళ్లలో ఏదో ప్రాకేటట్టు ఉండి, కాళ్లను ఆడించకుండా ఉండలేకపోతున్నారా? ప్రశాంతంగా నిద్రపోవడానికి కాళ్లు సహకరించడం లేదా? అయితే ఇది కేవలం అలసట మాత్రమే కాకపోవచ్చు. వైద్య భాషలో దీనిని 'రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్' (RLS) అంటారు. అసలు దీని లక్షణాలు ఏంటి? ఎప్పుడు న్యూరో సర్జన్ లేదా నాడీ నిపుణుడిని సంప్రదించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ ఉన్నవారికి కాళ్లలో విపరీతమైన అసౌకర్యం, లాగుతున్నట్లు ఉండటం, లేదా గుచ్చినట్లు అనిపిస్తుంది. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు ఈ ఇబ్బంది మరింత పెరుగుతుంది. కాళ్లను కదిలిస్తే తాత్కాలికంగా ఉపశమనం లభించినప్పటికీ, మళ్లీ కాళ్లు నిలకడగా ఉంచగానే ఈ అసౌకర్యం తిరిగి మొదలవుతుంది. దీనివల్ల రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టక తీవ్రమైన నిద్రలేమి సమస్య తలెత్తుతుంది.
- అసలు కారణాలు ఏమిటి?
ఈ సమస్యకు ప్రధానంగా నాడీ వ్యవస్థలో దోపమైన్ సమతుల్యత దెబ్బతినడం, ఐరన్ లోపం, నాడీ దెబ్బతినడం (న్యూరోపతి) లేదా వెన్నుపాముకు సంబంధించిన సమస్యలు కారణం కావచ్చు. కొన్నిసార్లు కిడ్నీ సమస్యలు, గర్భధారణ లేదా డయాబెటిస్ ఉన్నవారిలో కూడా ఈ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే పగటిపూట విపరీతమైన అలసట, మానసిక ఒత్తిడికి దారితీస్తుంది.
డాక్టర్‌ను ఎప్పుడు కలవాలి?
కాళ్లలో ఈ అసౌకర్యం రోజువారీ నిద్రను తీవ్రంగా భంగపరుస్తున్నా, కాళ్లతో పాటు చేతులకు కూడా వ్యాపిస్తున్నా, లేదా కాళ్లలో తిమ్మిర్లు, బలహీనత అనిపిస్తున్నా వెంటనే న్యూరోలాజిస్ట్ లేదా న్యూరో సర్జన్‌ను సంప్రదించాలి. సరైన రక్త పరీక్షలు, న్యూరోలాజికల్ పరీక్షల ద్వారా అసలు కారణాన్ని గుర్తించి మందులతో ఈ సమస్యను సులభంగా నయం చేయవచ్చు.

