Liver Damage Even Without Alcohol: కాలేయ వ్యాధులు అనగానే కేవలం మద్యం సేవించే వారికే వస్తాయని మనం అనుకుంటాం. కానీ భారతీయుల విషయంలో ఈ అంచనా తప్పని తాజా గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. మద్యం ముట్టుకోని వారిలో కూడా ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా విస్తరిస్తోంది. నేషనల్ మెడికల్ జర్నల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం, దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు మద్యం సేవించకుండానే కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.

ఏమిటీ MAFLD?

మద్యంతో సంబంధం లేకుండా జీవక్రియ లోపాల వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని మెటబాలిక్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. భారతదేశంలోని సుమారు 25 నుండి 30 శాతం మంది వయోజనులు ఈ సమస్య బారిన పడుతున్నారు. ఇది మొదట్లో ఎటువంటి లక్షణాలను చూపించదు, అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. వ్యాధి ముదిరిన తర్వాతే బయటపడటం వల్ల ప్రాణాపాయానికి దారితీస్తోంది.

మద్యం తాగకపోయినా వ్యాధి రావడానికి కారణాలు:

మనం అనుసరిస్తున్న ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లే కాలేయాన్ని నాశనం చేస్తున్నాయి..

చక్కెర - మద్యం కంటే ప్రమాదకరం: మనం తాగే కూల్ డ్రింక్స్, తీపి పానీయాలు, బేకరీ ఉత్పత్తులలో ఉండే ఫ్రక్టోజ్‌ను కాలేయం నేరుగా ప్రాసెస్ చేస్తుంది. ఈ చక్కెర పరిమాణం ఎక్కువైతే, కాలేయం దానిని నేరుగా కొవ్వుగా మార్చి అక్కడే నిల్వ చేస్తుంది.

జంక్ ఫుడ్ ప్రభావం: బయట దొరికే వేయించిన పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కాలేయ కణాలలో వాపు ఏర్పడుతుంది. ఇది కొవ్వు పేరుకుపోయే ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది.

నిశ్చల జీవనశైలి: ఎనిమిది గంటలకు పైగా కూర్చుని పనిచేయడం, కనీస వ్యాయామం లేకపోవడం వల్ల శరీరంలో కేలరీలు పేరుకుపోతాయి. ఈ అదనపు కేలరీలు కాలేయం చుట్టూ కొవ్వుగా మారి ప్రమాదకరంగా మారుతున్నాయి.

ఊబకాయం - మధుమేహం: అధిక బరువు మరియు షుగర్ వ్యాధి ఉన్నవారిలో ఈ ఫ్యాటీ లివర్ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

నివారణ మార్గాలు:

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నిపుణుల సూచనలు:

ఆహార నియంత్రణ: పంచదార, మైదా, జంక్ ఫుడ్ వాడకాన్ని తగ్గించి.. తాజా కూరగాయలు, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.

శారీరక శ్రమ: ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక లేదా వ్యాయామం చేయడం వల్ల కాలేయంలో పేరుకున్న అదనపు కొవ్వు కరిగిపోతుంది.

క్రమం తప్పకుండా పరీక్షలు: లక్షణాలు లేకపోయినా, 30 ఏళ్లు దాటిన వారు ఏడాదికి ఒకసారి కాలేయ పనితీరు పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవడం ఉత్తమం.

PolitEnt Media

PolitEnt Media

Next Story