Migraine: నేటి ఆధునిక జీవనశైలి, మానసిక ఒత్తిడి, నిద్రలేమి కారణంగా చాలామందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో మైగ్రేన్ ఒకటి. మైగ్రేన్ అనగానే చాలామంది కేవలం తీవ్రమైన తలనొప్పి మాత్రమే అనుకుంటారు. కానీ, మైగ్రేన్ ప్రభావం కేవలం తలకు మాత్రమే పరిమితం కాదు. ఇది శరీరంలోని పలు అవయవాలు, నాడీ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది.

సాధారణ తలనొప్పికి, మైగ్రేన్‌కు మధ్య ఉన్న తేడాను గుర్తించకపోతే అది దైనందిన జీవితాన్ని, పని సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. మైగ్రేన్ తీవ్రమైనప్పుడు కనిపించే ఇతర లక్షణాలు ఏమిటి? ఎలాంటి పరిస్థితుల్లో వెంటనే వైద్యులను సంప్రదించాలి? అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

తలనొప్పితో పాటు కనిపించే ఇతర ప్రధాన లక్షణాలు

మైగ్రేన్ దాడి సమయంలో తలలో ఒకవైపు లేదా రెండు వైపులా విపరీతమైన నొప్పి రావడమే కాకుండా క్రింది సూచనలు కూడా కనిపిస్తాయి.

వాంతులు, వికారం:

తలనొప్పితో పాటు కడుపులో తిప్పడం, వికారం లేదా వాంతులు కావడం చాలామందిలో చూస్తుంటాము.

వెలుతురు, శబ్దాల పట్ల సున్నితత్వం : మైగ్రేన్ ఉన్నవారికి విపరీతమైన వెలుతురు, పెద్ద శబ్దాలు లేదా తీవ్రమైన వాసనలు చూస్తే నొప్పి మరింత ఎక్కువవుతుంది.

ముందస్తు సూచనలు:

తలనొప్పి ప్రారంభం కావడానికి కంటే ముందే శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. మానసిక స్థితిలో మార్పులు , మెడ పట్టివేయడం, తరచుగా ఆవలింతలు రావడం, కొన్ని పదార్థాలు తినాలనిపించడం లేదా అకస్మాత్తుగా మూత్రవిసర్జన పెరగడం వంటివి జరుగుతాయి.

ఆరా లక్షణాలు:

కొంతమందిలో తలనొప్పి రావడానికి ముందు లేదా నొప్పి సమయంలో కళ్ల ముందు వెలుగులు మెరిసినట్లు అనిపించడం, చుక్కలు లేదా వింత ఆకారాలు కనిపించడం, చేతులు-కాళ్లలో తిమ్మిర్లు రావడం, మాట తొట్రుపడటం వంటి నాడీ సంబంధిత లక్షణాలు ఉంటాయి.

దాడి తర్వాత నీరసం:

తలనొప్పి తగ్గిన తర్వాత కూడా రోగికి విపరీతమైన అలసట, బలహీనత మరియు మానసిక అయోమయం వేధిస్తాయి.

ఉపశమనం కోసం పాటించాల్సిన చిట్కాలు

సరైన నిద్ర, ఆహారం:

రోజూ తగినంత నిద్రపోవడం, వేళకు భోజనం చేయడం, పుష్కలంగా నీరు తాగడం చాలా అవసరం.

చీకటి, ప్రశాంతమైన వాతావరణం:

తలనొప్పి ప్రారంభమైన వెంటనే ప్రశాంతమైన, తక్కువ వెలుతురు ఉన్న గదిలో విశ్రాంతి తీసుకోవాలి.

మైగ్రేన్ డైరీ నిర్వహణ:

ఏ పరిస్థితులు లేదా ఏ ఆహార పదార్థాలు తిన్నప్పుడు మీకు తలనొప్పి వస్తుందో ఒక డైరీలో నోట్ చేసుకోవడం ద్వారా మీ ట్రిగ్గర్స్ ను గుర్తించవచ్చు.

ఒత్తిడి నిర్వహణ: మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామాలు, ధ్యానం చేయాలి.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

మైగ్రేన్ తరచుగా వస్తున్నా లేదా రోజూవారీ పనులకు భంగం కలిగిస్తున్నా ఖచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలి. అయితే క్రింది అత్యవసర పరిస్థితులు కనిపిస్తే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మెడికల్ హెల్ప్ తీసుకోవాలి.

అకస్మాత్తుగా, తీవ్రమైన పిడుగు పడినట్లుగా తలనొప్పి రావడం.

తలనొప్పితో పాటు జ్వరం, మెడ బిగుసుకుపోవడం, మూర్ఛ లేదా స్పృహ తప్పడం.

మాట స్పష్టత లోపించడం, దృష్టి మసకబారడం లేదా శరీరంలో ఏదైనా ఒక వైపు భాగం బలహీనపడటం, తిమ్మిరి ఎక్కడం.

తలకు ఏదైనా దెబ్బ

తగిలిన తర్వాత తీవ్రమైన తలనొప్పి ప్రారంభం కావడం.

PolitEnt Media

PolitEnt Media

Next Story