Mistaking Joint Pain for Fatigue: శరీరంలో కీళ్ల నొప్పులు రాగానే చాలామంది అలసట వల్లనో లేదా వయసు పైబడటం వల్లనో వచ్చిన సాధారణ నొప్పులని భావించి తేలికగా తీసుకుంటారు. పెయిన్ కిల్లర్లు వేసుకుంటూ కాలం గడిపేస్తుంటారు. అయితే, ఈ చిన్నపాటి నొప్పులే భవిష్యత్తులో తీవ్రమైన ఆర్థరైటిస్ సమస్యకు దారితీయవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రారంభ దశలోనే దీని లక్షణాలను గుర్తిస్తే సరైన చికిత్స ద్వారా సమస్య ముదరకుండా అరికట్టవచ్చని చెబుతున్నారు.

ఆర్థరైటిస్ ప్రధాన లక్షణాలు

ఉదయాన్నే కీళ్ల బిగుతుదనం

నిద్రలేవగానే చేతి వేళ్లు, మోకాళ్లు లేదా ఇతర కీళ్లు బిగుసుకుపోయి కదపడం కష్టంగా మారడం ఆర్థరైటిస్ ప్రారంభ సంకేతం. కీళ్ళు సాధారణ స్థితికి రావడానికి కాస్త సమయం పడుతుంది. ఈ సమస్య తరచూ పునరావృతమైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

రోజువారీ పనుల్లో అసౌకర్యం - నొప్పి

మెట్లు ఎక్కడం, కింద కూర్చుని లేవడం, వస్తువులను పట్టుకోవడం లేదా వంగి పనులు చేసే సమయంలో కీళ్లలో తీవ్రమైన నొప్పి రావడం. ప్రారంభంలో కాసేపు విశ్రాంతి తీసుకుంటే నొప్పి తగ్గినా, క్రమంగా ఇది నిత్యకృత్యాలకు తీవ్ర ఆటంకం కలిగిస్తుంది.

కీళ్ల వాపు - వేడి

కీళ్ళు వాచిపోవడం, ఆ ప్రాంతాన్ని తాకినప్పుడు వేడిగా అనిపించడం, కాళ్లు లేదా చేతులను పూర్తిగా మడవడం లేదా నిటారుగా ఉంచడం కష్టంగా మారడం గమనించాల్సిన అంశాలు.

ఎప్పుడు అత్యవసరంగా వైద్యుడిని సంప్రదించాలి?

కీళ్ల ప్రాంతం అకస్మాత్తుగా ఎర్రబడి, వాచిపోయి, భరించలేని నొప్పితో పాటు జ్వరం కూడా వస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే ఆర్థోపెడిక్ నిపుణులను సంప్రదించాలి. ఇవి ఇన్ఫెక్షన్ లేదా తీవ్రమైన ఆర్థరైటిస్ వల్ల వచ్చే ప్రమాదముంది.

చికిత్స - జాగ్రత్తలు:

ఆర్థరైటిస్ తీవ్రతను బట్టి వైద్యులు చికిత్సను నిర్ణయిస్తారు..

మందులు - ఫిజియోథెరపీ

ప్రారంభ దశలో వాపు, నొప్పిని తగ్గించే మందులు, వ్యాయామాల (ఫిజియోథెరపీ) ద్వారా ఉపశమనం పొందవచ్చు.

జీవనశైలి మార్పులు:

బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల మోకాళ్లపై పడే భారం తగ్గుతుంది. క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామాలు చేయాలి.

శస్త్రచికిత్స:

తీవ్రమైన మోకాళ్ల అరుగుదల ఉన్నవారికి ఇతర చికిత్సలు పనిచేయని పక్షంలో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స ను నిపుణులు సూచిస్తారు.

కీళ్ల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభంలోనే వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా సరైన చికిత్స పొంది సాధారణ, ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించవచ్చు.

Next Story