Nipah Virus Scare: కేరళలో మళ్లీ ప్రమాదకరమైన నిపా వైరస్ కేసు వెలుగుచూడటంతో పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు అప్రమత్తమయ్యాయి. వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా నిరోధించడానికి సరిహద్దు వెంబడి అధికారులు నిఘాను తీవ్రతరం చేశారు.

కోజికోడ్‌లో తొలి కేసు నమోదు

కేరళలోని కోజికోడ్‌కు చెందిన ఒక 43 ఏళ్ల వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో, అతని నమూనాలను పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో అతనికి నిపా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం సదరు రోగికి కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అతనితో ప్రాథమికంగా సన్నిహితంగా మెలిగిన సుమారు 77 మందిని గుర్తించి, ఐసోలేషన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. బాధిత ప్రాంతాల్లోని కొన్ని గ్రామాలు, వార్డులను ఇప్పటికే కంటైన్‌మెంట్ జోన్‌లుగా ప్రకటించి ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారు.

సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు

వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటంతో కేరళతో సరిహద్దులు పంచుకునే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. చామరాజనగర, మైసూరు, కొడగు, దక్షిణ కన్నడ వంటి సరిహద్దు జిల్లాల చెక్‌పోస్టుల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

ఆరోగ్య పరీక్షలు:

రక్షణ సూట్లు, ఫేస్ మాస్క్‌లు ధరించిన ఆరోగ్య సిబ్బంది సరిహద్దు దాటే వాహనాలను ఆపి ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. జ్వరం లేదా ఇతర లక్షణాలు లేవని నిర్ధారించుకున్నాకే అనుమతిస్తున్నారు. కేరళ నుండి కూరగాయలు, పండ్లను రవాణా చేసే వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచారు.

నిపా వైరస్ ఎలా వ్యాపిస్తుంది?

ఇది జంతువుల నుండి మానవులకు వ్యాపించే ఒక ప్రమాదకరమైన జూనోటిక్ వైరస్. ప్రధానంగా గబ్బిలాల మలం లేదా లాలాజలంతో కలుషితమైన పండ్లను మానవులు తినడం ద్వారా ఇది సోకుతుంది. వైరస్ సోకిన పందులు, గుర్రాలు, కుక్కలు వంటి జంతువుల ప్రత్యక్ష పరిచయం వల్ల కూడా వ్యాప్తి చెందుతుంది.

ప్రధాన లక్షణాలు..

అధిక జ్వరం మరియు తీవ్రమైన తలనొప్పి

కండరాల నొప్పులు, గొంతు నొప్పి

తల తిరగడం, వాంతులు, విపరీతమైన నీరసం

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

మరోవైపు షిగెల్లా వైరస్ భయాలు:

కేరళలోని వయనాడ్ ప్రాంతంలో ఒక పాఠశాల విద్యార్థినితో సహా సుమారు 9 మందికి షిగెల్లా బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ సోకినట్లు తేలింది. ఒకేసారి రెండు రకాల ఇన్ఫెక్షన్లు కలకలం రేపుతుండటంతో అటు కేరళ ఆరోగ్య శాఖ, ఇటు కేంద్ర బృందాలు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story