Noticing These Changes in Elderly People: మీకు తెలిసిన ప్రాంతాల్లో తిరగడానికి ఇబ్బంది పడుతున్నారా? తరచూ విషయాలను మర్చిపోతున్నారా? లేదా ఆలోచనలు సక్రమంగా సాగక తికమక పడుతున్నారా? అయితే జాగ్రత్త! ఇది కేవలం వయసుతో వచ్చే మార్పు మాత్రమే కాకపోవచ్చు.. మున్ముందు మీ గుండె ప్రమాదంలో పడబోతోందని చెప్పే ముందస్తు హెచ్చరిక కావొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

సాధారణంగా గుండెపోటు లేదా పక్షవాతం వచ్చిన తర్వాత మెదడు సామర్థ్యం తగ్గుతుందని మనకు తెలుసు. కానీ, గుండె జబ్బులు రాకముందే మేధాశక్తి క్షీణిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. 65 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయసు గల వృద్ధులపై జరిపిన పరిశోధనల్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. గుండెపోటు లేదా గుండె వైఫల్యంతో ఆసుపత్రిలో చేరడానికి దాదాపు 3 నుంచి 8 ఏళ్ల ముందే విషయగ్రహణ సామర్థ్యం తగ్గడం మొదలవుతుందని పరిశోధకులు గుర్తించారు.

ఈ అధ్యయనం ప్రకారం.. జ్ఞాపకశక్తి మందగించడం, భాషా సామర్థ్యం తగ్గడం, విషయాలను స్పష్టంగా విడమర్చి చెప్పలేకపోవడం వంటివి గుండె జబ్బుకు తొలి సూచికలు. ముఖ్యంగా గలగలా మాట్లాడే వేగం తగ్గడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటి మార్పులు వృద్ధుల్లో చాలా వేగంగా జరుగుతున్నట్టు గుర్తించారు. విషయాలను గ్రహించే వేగం నెమ్మదించడం అనేది మీ గుండె ఆరోగ్యం క్షీణిస్తోందని చెప్పడానికి మెదడు ఇచ్చే మొదటి సిగ్నల్ అని ఈ పరిశోధన వివరిస్తోంది.

ఈ పరిశోధన ఫలితాల ఆధారంగా, గుండెపోటు ముప్పు పొంచి ఉన్నవారిని కొన్నేళ్ల ముందే గుర్తించే అవకాశం ఉందని వైద్యులు భావిస్తున్నారు. కాబట్టి, ఇంట్లో పెద్దవారిలో ఇలాంటి మేధోపరమైన మార్పులు కనిపిస్తే, దానిని కేవలం వృద్ధాప్య సమస్యగా కొట్టిపారేయకుండా.. గుండె పరీక్షలు చేయించుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story