Diabetes and Obesity: భారతదేశంలో డయాబెటిస్, అధిక బరువు సమస్యలు మునుపెన్నడూ లేని విధంగా వేగంగా విస్తరిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 నివేదిక దేశంలో మారుతున్న ప్రజల ఆరోగ్య స్థితిగతులపై తీవ్ర ఆందోళన రేకెత్తించింది. గత ఐదేళ్ల కాలంలో పురుషులు, మహిళల్లో ఈ రెండు ఆరోగ్య సమస్యల కేసులు గణనీయంగా పెరిగినట్లు సర్వే వెల్లడించింది.

దేశవ్యాప్తంగా 715 జిల్లాల్లో, సుమారు 6.79 లక్షల కుటుంబాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. 15 నుండి 49 ఏళ్ల మధ్య వయసున్న వారిలో ఈ లైఫ్‌స్టైల్ డిజార్డర్స్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మహిళల్లో వేగంగా పెరుగుతున్న బరువు.. ప్రతి ముగ్గురిలో ఒకరికి ముప్పు..

సర్వే నివేదిక ప్రకారం.. గత ఐదేళ్లలో 15-49 ఏళ్ల వయసు గల పురుషులలో ఊబకాయం పెరుగుదల 4.4 శాతంగా నమోదు కాగా, మహిళల్లో ఇది ఏకంగా 6.7 శాతంగా నమోదైంది. 2019-21 కాలంలో దేశంలో 24 శాతం మంది మహిళలు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడేవారు. 2023-24 నాటికి ఈ రేటు ఏకంగా 30.7 శాతానికి చేరుకుంది. అంటే ప్రస్తుతం దేశంలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు.

పట్టణాల్లో మరీ దారుణం..

గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. నగరాల్లోని మహిళల్లో 42.8 శాతం మంది అధిక బరువుతో బాధపడుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు 25.5 శాతంగా ఉంది. జంక్ ఫుడ్ సంస్కృతి, శారీరక శ్రమ లేని నిశ్చల జీవనశైలి, వ్యాయామం లేకపోవడమే దీనికి ప్రధాన కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

పురుషుల్లో పెరుగుతున్న సైలెంట్ కిల్లర్ షుగర్

ఊబకాయంతో పాటు దేశంలో బ్లడ్ షుగర్ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. 15 ఏళ్లు పైబడిన పురుషులలో అధిక రక్త చక్కెర స్థాయిల శాతం 2019-21లో 15.6 శాతంగా ఉంటే, అది 2023-24 నాటికి 20.9 శాతానికి పెరిగింది. మహిళల్లోనూ, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మధుమేహం కేసులు మునుపటి కంటే వేగంగా విస్తరిస్తున్నట్లు ఈ సర్వే స్పష్టం చేసింది.

నివారణకు వైద్యుల ముఖ్య సూచనలు..

ఊబకాయం, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ఒక్కటే మార్గమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అందుకోసం ఈ క్రింది జాగ్రత్తలు తప్పనిసరి:

రోజూ వ్యాయామం:

ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్, రన్నింగ్ లేదా ఏదైనా శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి.

ఆహార నియమాలు:

జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, చక్కెర పదార్థాలను వీలైనంత వరకు తగ్గించాలి.

ఫైబర్ ఫుడ్:

నిత్యం తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.

సరైన నిద్ర:

ఒత్తిడిని తగ్గించుకుంటూ, రోజుకు కనీసం 7 నుండి 8 గంటల పాటు ప్రశాంతమైన నిద్ర పోవాలి.

రెగ్యులర్ చెకప్స్:

30 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా బ్లడ్ షుగర్, వెయిట్ చెకప్స్ చేయించుకోవడం ద్వారా ఈ ముప్పును ముందే గుర్తించి అరికట్టవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story