Passing Blood Clots During Periods: పీరియడ్స్‌లో రక్తం గడ్డకడుతోందా?ఏ పరిస్థితుల్లో డాక్టర్‌ను కలవాలి? మహిళలు తెలుసుకోవాల్సిన విషయాలివే..
మహిళలు తెలుసుకోవాల్సిన విషయాలివే..

Passing Blood Clots During Periods: మహిళల్లో పీరియడ్స్ సమయంలో రక్తస్రావంతో పాటు చిన్న చిన్న రక్తపు గడ్డలు రావడం చాలామందిలో చూస్తుంటాం. ముఖ్యంగా మొదటి రెండు రోజులు బ్లీడింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా జరగడం సహజమే అయినప్పటికీ, పెద్ద పరిమాణంలో గడ్డలు పడటం లేదా తీవ్రమైన కడుపు నొప్పి ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం తేలికగా తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పీరియడ్స్‌లో రక్తం గడ్డలు ఎందుకు ఏర్పడతాయి?
సాధారణంగా నెలసరి 2 నుంచి 7 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో గర్భాశయం లోపలి పొర విచ్ఛిన్నమై రక్తంతో పాటు బయటకు వస్తుంది. రక్తస్రావం వేగంగా లేదా ఎక్కువగా ఉన్నప్పుడు, రక్తం గర్భాశయం లేదా యోని భాగంలో కొద్దిసేపు నిల్వ ఉండి గడ్డలుగా మారుతుంది. అప్పుడప్పుడు చిన్న గడ్డలు రావడం సహజమే. అయితే శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు గర్భాశయ పొరపై ప్రభావం పడి ఈ సమస్య తీవ్రమవుతుంది. గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు, అడినోమయోసిస్ వంటి సమస్యలు ఉన్నా కూడా అధిక రక్తస్రావంతో పాటు పెద్ద గడ్డలు ఏర్పడతాయి.
ఏ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి?
కింది లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి.
నాణెం పరిమాణం కంటే పెద్ద రక్తపు గడ్డలు పదేపదే రావడం.
రక్తస్రావం అధికమై ప్రతి గంట లేదా రెండు గంటలకోసారి ప్యాడ్ మార్చాల్సి రావడం.
పీరియడ్స్ 7 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగడం.
తీవ్రమైన కడుపునొప్పి, విపరీతమైన నీరసం, తల తిరగడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండటం.
వరుసగా రెండు గంటల పాటు గంటకో ప్యాడ్ పూర్తిగా తడిసిపోవడం, తలతిరగడం వంటివి ఉంటే తక్షణమే అత్యవసర వైద్య సహాయం అవసరమని గుర్తించాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పోషకాహారం - హైడ్రేషన్:
నెలసరి సమయంలో శరీరానికి తగినంత విశ్రాంతినిస్తూ, పుష్కలంగా నీరు తాగాలి. ఐరన్ మరియు పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
రక్తహీనతపై నిఘా:
పదేపదే అధిక రక్తస్రావం జరిగితే శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంది. వైద్యుల సలహాతో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ వంటి పరీక్షలు చేయించుకోవడం మంచిది.

