Perimenopause: మెనోపాజ్‌కు ముందే మొదలయ్యే పెరిమెనోపాజ్.. మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే..
తెలుసుకోవాల్సిన అంశాలివే..

Perimenopause: మహిళల జీవితంలో మెనోపాజ్ అనేది ఒక సహజ శారీరక ప్రక్రియ. అయితే, మెనోపాజ్‌కు చేరడానికి ముందే శరీరం పెరిమెనోపాజ్ అనే పరివర్తన దశలోకి ప్రవేశిస్తుందన్న విషయం చాలామందికి తెలియదు. ఈ దశలో శరీరంలో చోటుచేసుకునే హార్మోన్ల మార్పులు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు పలు కీలక వివరాలు వెల్లడించారు.
అసలు ఏమిటీ పెరిమెనోపాజ్?
మెనోపాజ్ దశకు కొన్నేళ్ల ముందే శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల హెచ్చుతగ్గులు ప్రారంభమవుతాయి. ఈ పరివర్తన కాలాన్నే పెరిమెనోపాజ్ అంటారు. సాధారణంగా ఇది 35 నుండి 40 ఏళ్ల వయస్సు మధ్యలో మొదలయ్యే అవకాశం ఉంటుంది.
ప్రధాన లక్షణాలు:
క్రమరహిత నెలసరి: పీరియడ్స్ ముందుగా రావడం లేదా కొన్ని వారాలు, నెలల పాటు ఆలస్యం కావడం. రక్తస్రావం పరిమాణంలో మార్పులు.
శారీరక అసౌకర్యాలు: వేడి ఆవిర్లు, రాత్రిపూట విపరీతంగా చెమటలు పట్టడం, నిద్రలేమి, తీవ్రమైన అలసట.
మానసిక మార్పులు: మానసిక కల్లోలం, చిరాకు, డిప్రెషన్, పనులపై ఏకాగ్రత తగ్గడం.
ఇతర మార్పులు: యోని పొడిబారడం, బరువు పెరగడం, చర్మ స్వభావంలో మార్పులు.
35-40 ఏళ్ల మహిళలు పాటించాల్సిన జాగ్రత్తలు
సమతుల్య పోషకాహారం: ఎముకల బలం కోసం కాల్షియం, కండరాల దృఢత్వానికి తగినంత ప్రొటీన్ ఉండే ఆహారం తీసుకోవాలి.
జీవనశైలి మార్పులు: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, రోజుకు 7-8 గంటల నిద్ర, ధ్యానం లేదా యోగా ద్వారా ఒత్తిడిని నియంత్రించడం. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది.
రెగ్యులర్ స్క్రీనింగ్స్: బీపీ, బరువు, గుండె ఆరోగ్యం, ఎముకల సాంద్రత వంటి అంశాలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి.
అపోహలు వద్దు - వైద్య సలహా తప్పనిసరి
హార్మోన్ల మార్పులన్నీ వ్యాధులు కావు, అలాగే ప్రతి ఒక్కరికీ హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ అవసరం ఉండదు. అయితే, అసాధారణ రక్తస్రావం జరుగుతున్నా లేదా పెరిమెనోపాజ్ లక్షణాలు రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నా వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి.

