Period Cramps or Pregnancy Symptoms: పీరియడ్స్ నొప్పులా లేక ప్రెగ్నెన్సీ లక్షణాలా? గర్భ నిర్ధారణ పరీక్ష ఎప్పుడు చేసుకోవాలి?
ఎప్పుడు చేసుకోవాలి?

Period Cramps or Pregnancy Symptoms: చాలామంది మహిళలు పీరియడ్స్ రావడానికి ముందు తీవ్ర అలసట, రొమ్ములలో నొప్పి, పొత్తికడుపులో తిమ్మిరి, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ఇవే లక్షణాలు గర్భధారణ ప్రారంభ దశలోనూ కనిపిస్తుండటంతో.. తాము గర్భవతి అయ్యామేమోనన్న సందేహంతో చాలామంది మహిళలు హడావిడిగా ప్రెగ్నెన్సీ టెస్టులు చేసుకుంటారు. కానీ సరైన సమయం రాకముందే తొందరపడి పరీక్ష చేసుకుంటే, నిజంగానే గర్భం దాల్చినప్పటికీ టెస్టు ఫలితం నెగటివ్‌గా వచ్చే అవకాశం ఉంది. అసలు పీరియడ్స్ లక్షణాలకు, ప్రెగ్నెన్సీ లక్షణాలకు మధ్య తేడా ఏమిటి? ఇంట్లోనే గర్భ నిర్ధారణ పరీక్ష ఎప్పుడు, ఎలా చేసుకోవాలి? అనే విషయాలపై వైద్య నిపుణులు పలు కీలక సూచనలు చేస్తున్నారు.
కేవలం లక్షణాలతోనే గర్భాన్ని నిర్ధారించలేం..
గర్భధారణ తొలి దశలో శరీరంలో హార్మోన్ల మార్పులు వేగంగా జరుగుతాయి. దీనివల్ల రొమ్ములలో వాపు, నొప్పి, పొత్తికడుపులో తిమ్మిరి వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే ప్రతి మహిళలోనూ ఈ లక్షణాలు ఒకేలా ఉండవు. నెలసరి తప్పడం, అలసట, వికారం, తరచుగా మూత్రవిసర్జన రావడం వంటివి గర్భధారణ ప్రారంభ సంకేతాలు అయినప్పటికీ.. శరీరంలో ఇతర హార్మోన్ల మార్పుల వల్ల కూడా ఇవి సంభవించవచ్చు. అందువల్ల కేవలం శారీరక లక్షణాలను బట్టి గర్భం దాల్చారని ఒక నిర్ధారణకు రాలేము.
ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడానికి సరైన సమయం ఏది?
వైద్య పరిజ్ఞానం ప్రకారం.. ఇంట్లోనే ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా పరీక్ష చేసుకోవడానికి అత్యంత సరైన సమయం మీ నెలసరి తప్పిన మరుసటి రోజు. ఆ సమయానికి శరీరంలో హ్యూమన్ కోరియోనిక్ గోనాడోట్రోపిన్ (hCG) అనే ప్రత్యేక హార్మోన్ స్థాయి పెరుగుతుంది. సాధారణంగా ఇంట్లో వాడే గర్భ నిర్ధారణ కిట్లు ఈ hCG హార్మోన్ ఉనికిని సులభంగా గుర్తిస్తాయి.
పీరియడ్స్ సక్రమంగా లేని వారు ఏం చేయాలి?:
ఒకవేళ మహిళలకు నెలసరి తేదీ సరిగ్గా గుర్తులేకపోయినా లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య ఉన్నా.. అసురక్షిత శృంగారం జరిగిన కనీసం 21 రోజుల తర్వాత గర్భ నిర్ధారణ పరీక్ష చేసుకోవడం ఉత్తమం.
ఉదయం పూట పరీక్ష ఎందుకు ఉత్తమం?
గర్భ నిర్ధారణ పరీక్షను రోజులో ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు. కానీ ప్రారంభ రోజుల్లో ఉదయం నిద్రలేవగానే వచ్చే మొదటి మూత్రంతో పరీక్షించడం వల్ల అత్యంత ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఉదయం వేళ మూత్రంలో hCG హార్మోన్ గాఢత (సాంద్రత) ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కిట్ సులభంగా హార్మోన్‌ను గుర్తిస్తుంది. పరీక్ష చేసేటప్పుడు కిట్‌పై పేర్కొన్న సూచనలను ఖచ్చితంగా పాటించి, నిర్ణీత సమయంలోపే ఫలితాలను నమోదు చేసుకోవాలి.
టెస్టులో నెగటివ్ వస్తే ఏం చేయాలి?
కొన్నిసార్లు మహిళ గర్భవతి అయినప్పటికీ, చాలా ముందుగానే పరీక్ష చేసుకోవడం వల్ల ఫలితం నెగటివ్‌గా వస్తుంది. శరీరంలో hCG హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఒకవేళ మీకు పీరియడ్స్ రాకుండా ఉండి, టెస్టు ఫలితం నెగటివ్‌గా వస్తే ఆందోళన చెందాల్సిన పనిలేదు. మరో 2 నుండి 3 రోజుల తర్వాత మళ్లీ ఉదయం పూట టెస్ట్ చేసుకోండి. అప్పటికీ పీరియడ్స్ రాకపోతే, వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. వైద్యులు అవసరమైన రక్త పరీక్షల ద్వారా గర్భాన్ని కచ్చితంగా నిర్ధారించగలరు.

