వెంటనే ఈ టెస్టులు చేయించుకోండి..

Persistent Fatigue Despite Sleep: రాత్రంతా 7 నుంచి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోయారు.. కానీ ఉదయం లేవగానే మళ్ళీ అలసటగా అనిపిస్తోందా? రోజంతా ఏదో తెలియని నిస్సత్తువ, ఒంట్లో ఓపిక లేనట్లు అనిపిస్తోందా? అయితే దీన్ని కేవలం పని ఒత్తిడి అని సరిపెట్టుకోకండి. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా పెరుగుతున్నాయని మీ శరీరం ఇస్తున్న ముందస్తు హెచ్చరిక కావచ్చు.

అలసట ఎందుకు వస్తుంది?

మన శరీరానికి గ్లూకోజ్ అనేది ఇంధనం లాంటిది. మనం తిన్న ఆహారం గ్లూకోజ్‌గా మారి రక్తంలో చేరుతుంది. అక్కడి నుండి కణాల్లోకి వెళ్లి మనకు శక్తిని ఇవ్వాలి. కానీ శరీరంలో ఇన్సులిన్ సమతుల్యత దెబ్బతిన్నప్పుడు, ఆ గ్లూకోజ్ రక్తం నుండి కణాలకు చేరుకోలేదు. ఫలితంగా రక్తంలో చక్కెర పేరుకుపోతుంది కానీ శరీరానికి మాత్రం అందాల్సిన శక్తి అందదు. అందుకే మీరు తిన్నా, పడుకున్నా నిరంతరం అలసిపోయినట్లు అనిపిస్తుంది.

ఈ 5 లక్షణాలను గమనించండి:

డీహైడ్రేషన్: రక్తంలో చక్కెర పెరిగినప్పుడు, దాన్ని బయటకు పంపడానికి మూత్రపిండాలు అతిగా శ్రమిస్తాయి. దీనివల్ల తరచుగా మూత్ర విసర్జన జరుగుతుంది, ఫలితంగా శరీరంలో నీటి శాతం తగ్గి నీరసం వస్తుంది.

అతి దాహం - మసకబారిన చూపు: నోరు ఎండిపోవడం, విపరీతంగా దాహం వేయడం ప్రధాన లక్షణాలు. అంతేకాదు, పెరిగిన చక్కెర స్థాయిలు కంటి లెన్స్‌పై ప్రభావం చూపి చూపు మసకబారేలా చేస్తాయి.

బరువు తగ్గడం: మీరు ఎలాంటి డైట్ చేయకపోయినా అకస్మాత్తుగా బరువు తగ్గుతున్నారా? అయితే వెంటనే అలర్ట్ అవ్వండి.

ఆలస్యంగా తగ్గే గాయాలు: చిన్నపాటి గాయం అయినా అది తగ్గడానికి వారాల సమయం పడుతుంటే అది షుగర్ ప్రభావమే.

కాళ్లలో జలదరింపు: చేతులు, కాళ్లు తిమ్మిర్లు రావడం లేదా సూదులతో గుచ్చినట్లు అనిపించడం నరాలపై చక్కెర ప్రభావం చూపుతోందని చెప్పడానికి సంకేతం.

నివారణ మార్గాలు ఇవే:

పరీక్షలు చేయించుకోండి: ఆలస్యం చేయకుండా HbA1C, ఫాస్టింగ్ షుగర్ పరీక్షలు చేయించుకుని మీ షుగర్ లెవల్స్ తెలుసుకోండి.

ఆహారంలో మార్పులు: మైదా, చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.

చురుకైన జీవనశైలి: రోజుకు కనీసం 30 నిమిషాల నడక లేదా వ్యాయామం అలవాటు చేసుకోండి.

హైడ్రేటెడ్‌గా ఉండండి: శరీరం నుండి విషతుల్యాలను బయటకు పంపడానికి తగినంత నీరు తాగండి.

ముఖ్య గమనిక: ఏవైనా లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం చేసుకోకుండా, వెంటనే డాక్టరును సంప్రదించడం ఉత్తమం.

PolitEnt Media

PolitEnt Media

Next Story