Poor Sleep Putting Your Bones and Joints at Risk: సరిగ్గా నిద్రపోవట్లేదా? మీ ఎముకలు, కీళ్లు ప్రమాదంలో పడ్డట్లే.. డాక్టర్ల హెచ్చరిక..
డాక్టర్ల హెచ్చరిక..

Poor Sleep Putting Your Bones and Joints at Risk: రోజంతా పనిచేసి అలసిపోయిన శరీరానికి సరైన నిద్ర ఎంతైనా అవసరం. అయితే ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవనశైలి, ఉద్యోగ, వ్యక్తిగత జీవితాల ఒత్తిడి కారణంగా ముఖ్యంగా యువత తగినంత నిద్రకు దూరమవుతోంది. నిద్రలేమి అనగానే కేవలం అలసట, నీరసం మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇది ఆందోళన, ఒత్తిడిని పెంచడమే కాకుండా.. మన ఎముకలు, కీళ్లు, కండరాల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల ప్రకారం.. "తప్పుడు భంగిమలు, అస్తవ్యస్తమైన దినచర్య, ఒత్తిడి వల్ల కండరాలు బిగుసుకుపోతాయి. ఇవి నిద్ర నాణ్యతను దెబ్బతీయడమే కాకుండా దీర్ఘకాలంలో కీళ్ల సమస్యలకు దారితీస్తాయి" అని వివరిస్తున్నారు.
కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా?
విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ మరియు ఐటీ నిపుణులు కంప్యూటర్ల ముందు వంగిన భంగిమలో గంటల తరబడి కూర్చోవడం వల్ల మెడ, వీపుపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. దీనివల్ల తొడ వెనుక కండరాలు, పిక్కలు బిగుసుకుపోయి మోకాళ్ల నొప్పులు ప్రారంభమవుతాయి. భవిష్యత్తులో ఇది మోకాలు, వీపు కీళ్లలో ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. కండరాలు బిగుసుకుపోవడం వల్ల రాత్రి వేళల్లో ప్రశాంతమైన నిద్ర కరువై, కండరాల అలసట మరింత ఎక్కువవుతుంది.
నిద్రలేమితో నొప్పి ఇంకా పెరుగుతుందా?
మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడే శరీరంలోని కండరాలకు తగిన విశ్రాంతి లభించి, అవి కోలుకుంటాయి. నిరంతరం తక్కువ సేపు నిద్రపోవడం వల్ల కండరాల అలసట, బిగువు పెరుగుతాయి. ఇదివరకే మెడ, వీపు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారికి నిద్రలేమి వల్ల ఆ నొప్పులు మరింత తీవ్రమై, నరకం చూపిస్తాయి. అంతేకాకుండా చాలామంది మానసిక ఒత్తిడిని బయటకు చెప్పడానికి భయపడి దాచేస్తుంటారు. ఎముకల నొప్పులతో డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు మానసిక ఒత్తిడి కూడా ఒక కారణమా అని కోణంలో విచారించడం ముఖ్యం.
తప్పుడు పరుపులు.. మెత్తటి సోఫాలు మరింత ప్రమాదం
చాలామంది అతి మృదువుగా ఉండే పరుపులు, సోఫాలు, రిక్లైనర్లు వాడటానికి మొగ్గు చూపుతారు. కానీ ఇవి వెన్నెముకకు అవసరమైన సపోర్టును ఇవ్వవు. నిరంతరం ప్రయాణాలు చేసేవారు, హోటళ్లలో బస చేసేవారు ఇటువంటి మృదువైన పరుపులపై నిద్రపోవడం వల్ల నడుము నొప్పి మరియు వెన్నెముక క్షీణత సమస్యలు మరింత తీవ్రమవుతాయి.
కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ రాకుండా ఉండాలంటే?
సరైన భంగిమ : కూర్చున్నప్పుడు, నిద్రపోయేటప్పుడు వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి.
క్రమబద్ధమైన వ్యాయామం: రోజూ వ్యాయామం చేయడం వల్ల కండరాల బిగుతు తగ్గి, రాత్రి పూట మంచి నిద్ర పడుతుంది.
మంచి నిద్ర వాతావరణం: సరైన ఆధారమిచ్చే పరుపును ఎంచుకోవాలి. నిర్ణీత సమయానికి నిద్రపోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం.
మీరు కూడా నిరంతరం నిద్రలేమితో పాటు కీళ్ల నొప్పులతో బాధపడుతుంటే, అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆర్థోపెడిక్ నిపుణుడిని సంప్రదించి తగిన చికిత్స పొందడం మంచిది.

