Autism Treatment: ఆటిజమ్ స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఏఎస్‌డీ)తో బాధపడుతున్న పిల్లలకు ప్రొబయాటిక్ మాత్రలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని భారతదేశంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఈ మాత్రలు ప్రవర్తన సమస్యలు, జీర్ణకోశ ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతున్నాయని పరిశోధకులు తెలిపారు.

ఈ అధ్యయనంలో 2 నుంచి 9 ఏళ్ల వయస్సు గల ఆటిజమ్ పిల్లలను ఎంచుకుని రెండు బృందాలుగా విభజించారు. ఒక బృందానికి రోజుకు రెండుసార్లు చొప్పున మూడు నెలల పాటు ప్రొబయాటిక్ మాత్రలు ఇవ్వగా, మరో బృందానికి ఉత్తుత్తి (ప్లేసిబో) మాత్రలు ఇచ్చారు. రెండు బృందాలకూ ప్రామాణిక చికిత్సలు, పునరుత్తేజ చికిత్సలు అందించారు. ప్రవర్తన, జీర్ణకోశ తీవ్రతను కొలిచే వివిధ స్కోర్ల ఆధారంగా ఫలితాలను అంచనా వేశారు.

ప్రొబయాటిక్స్ తీసుకున్న పిల్లల్లో లక్షణాల తీవ్రత గణనీయంగా తగ్గినట్లు తేలింది. నలుగురితో కలవడం, నిస్సత్తువ వంటి సమస్యలు 40 శాతం వరకు తగ్గాయి. మాటిమాటికీ ఒకే రకమైన కదలికలు చేయడం, అతి చురుకుదనం, అనుచిత సంభాషణ వంటి లక్షణాలు కూడా బాగా తగ్గినట్లు గమనించారు. చిరాకు విషయంలో రెండు బృందాల్లోనూ పెద్దగా తేడా లేకపోయినా, ప్రొబయాటిక్స్ తీసుకున్నవారిలో మొత్తం ప్రవర్తన స్కోర్లు మెరుగయ్యాయి.

అంతేకాకుండా మలబద్ధకం, విరేచనాలు వంటి జీర్ణకోశ సమస్యలు కూడా తగ్గుముఖం పట్టాయి. పేగుల ఆరోగ్యాన్ని బలోపేతం చేయడం ద్వారా మెదడు-పేగు అనుసంధానం (గట్-బ్రెయిన్ యాక్సిస్) మెరుగుపడి ప్రవర్తనపై సానుకూల ప్రభావం చూపుతోందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఆటిజమ్ పిల్లల్లో పేగు సూక్ష్మజీవుల అసమతుల్యత సాధారణంగా కనిపిస్తుందని, ప్రొబయాటిక్స్ దీన్ని సరిచేయడంలో సహాయపడతాయని వివరించారు.

ఈ అధ్యయనం ఆటిజమ్ చికిత్సలో కొత్త దిశను చూపుతోంది. అయితే తల్లిదండ్రులు వైద్యుల సలహా తీసుకుని మాత్రమే ఈ మాత్రలను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో పెద్ద స్థాయి అధ్యయనాలు జరిగితే మరింత స్పష్టమైన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆటిజమ్ పిల్లల సంక్షేమం కోసం ప్రారంభంలోనే గుర్తించి సమగ్ర చికిత్సలు అందించడం అవసరమని ఈ అధ్యయనం మరోసారి నొక్కి చెప్పింది.

Next Story