Rising Anemia in Children: నేటి కాలంలో పిల్లల ఆరోగ్యంపై ఆహారపు అలవాట్లు, జీవనశైలి తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో రక్తహీనత కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. భారతదేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో దాదాపు 58శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇది కేవలం శారీరక బలహీనత మాత్రమే కాదు, పిల్లల మెదడు వికాసంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.

రక్తహీనతకు ప్రధాన కారణాలు ఏమిటి?

పిల్లల శరీరంలో ఎర్ర రక్త కణాలు లేదా హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటాన్ని రక్తహీనత అంటారు. దీనికి ప్రధాన కారణాలు..

పోషకాహార లోపం: ఆహారంలో ఇనుము, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉండటం.

జంక్ ఫుడ్: పోషకాలు లేని జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన రక్తం తయారవ్వదు.

ఇన్ఫెక్షన్లు: కడుపులో నులిపురుగులు ఉండటం లేదా తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ల వల్ల రక్తం తగ్గుతుంది.

పాలు అధికంగా తాగడం:

ఏడాది దాటిన పిల్లలు రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ ఆవు పాలు తాగితే, అవి ఇతర పోషకాహారంపై ఆసక్తిని తగ్గించి ఇనుము లోపానికి దారితీయవచ్చు.

తల్లిదండ్రుల గమనించాల్సిన తొలి లక్షణాలు:

రక్తహీనత ఉన్న పిల్లల్లో ఈ క్రింది మార్పులు కనిపిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేయవద్దు..

అలసట - నీరసం: కొంచెం ఆడుకున్నా త్వరగా అలసిపోవడం, ఎప్పుడూ పడుకోవాలని అనిపించడం.

చర్మం తెల్లబడటం: ముఖం, పెదవులు, గోర్లు మరియు కనురెప్పల లోపలి భాగం వెలవెలబోయినట్లు అనిపించడం.

ఏకాగ్రత లోపించడం:

చదువుపై శ్రద్ధ తగ్గడం, చిరాకుగా ఉండటం, ఆటలపై ఆసక్తి కోల్పోవడం.

వింత అలవాట్లు: కొందరు పిల్లలు మట్టి, సుద్దముక్కలు లేదా ఐస్ ముక్కలను తినడానికి ఇష్టపడతారు. ఇది తీవ్రమైన ఇనుము లోపానికి సంకేతం.

ఆకలి మందగించడం: సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, ఎదుగుదల ఆగిపోవడం.

నివారణ మార్గాలు - నిపుణుల సూచనలు:

సమతుల్య ఆహారం: ఆకుకూరలు (పాలకూర, తోటకూర), పప్పుధాన్యాలు, బెల్లం, వేరుశనగలు, మాంసాహారం (అందుబాటులో ఉంటే) పిల్లల డైట్‌లో చేర్చాలి.

విటమిన్-సి: ఇనుము శరీరానికి బాగా పట్టాలంటే నిమ్మరసం, ఉసిరి, జామ వంటి విటమిన్-సి పుష్కలంగా ఉండే పండ్లను ఇవ్వాలి.

పరిశుభ్రత: నులిపురుగుల నివారణకు ఏటా రెండుసార్లు వైద్యుల సలహాతో డీవార్మింగ్ చేయించాలి.

క్రమం తప్పకుండా పరీక్షలు: ఏడాదికి ఒకసారైనా పిల్లలకు బ్లడ్ టెస్ట్ చేయించి హిమోగ్లోబిన్ శాతాన్ని తనిఖీ చేయడం మంచిది.

PolitEnt Media

PolitEnt Media

Next Story