Rising Stroke Risk Among People Over 30: 30 దాటిన వారిలో పెరుగుతున్న పక్షవాతం ముప్పు.. యువతరం ఎందుకు జాగ్రత్తపడాలి?
యువతరం ఎందుకు జాగ్రత్తపడాలి?

Rising Stroke Risk Among People Over 30: స్ట్రోక్ అంటే కేవలం వృద్ధాప్యంలో మాత్రమే వచ్చే వ్యాధి అనుకుంటే పొరపాటే. మారుతున్న జీవనశైలి కారణంగా నేడు 30–40 ఏళ్ల వయస్సులోనే అనేకమంది యువకులు స్ట్రోక్ బారిన పడుతున్నారు. భారతదేశంలో నమోదవుతున్న మొత్తం స్ట్రోక్ కేసుల్లో దాదాపు 10 నుండి 15 శాతం కేసులు 45 ఏళ్లలోపు వారిలోనే వెలుగుచూస్తున్నాయని తాజా గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. దేశంలో వైకల్యానికి, మరణాలకు దారితీస్తున్న ప్రధాన కారణాల్లో పక్షవాతం ఒకటిగా మారింది.
యువతలో ఈ ముప్పు ఎందుకు పెరుగుతోంది?
గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేయడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిద్రలేమి, జంక్ ఫుడ్ అలవాట్లు మరియు శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడమే ఇందుకు ముఖ్య కారణాలు. ఈ అలవాట్లు నేరుగా రక్తపోటు , మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ సమస్యలకు దారితీస్తున్నాయి.
ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం: దేశంలో దాదాపు 10 కోట్ల మందికి పైగా మధుమేహంతో 31 కోట్ల మందికి పైగా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు.
నిశ్శబ్ద శత్రువు:
చాలామందిలో ఎలాంటి ప్రాథమిక లక్షణాలు బయటపడకపోవడంతో "మేము ఆరోగ్యంగానే ఉన్నాం" అనే భ్రమలో ఉంటారు. దీనివల్ల సమస్య ముదిరి ఆకస్మికంగా పక్షవాతానికి దారితీస్తోంది.
కనిపించే హెచ్చరిక సంకేతాలు
కింది లక్షణాలు అకస్మాత్తుగా కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు..
ముఖం ఒకవైపునకు వంకరపోవడం
ఒక చేయి లేదా కాలులో పట్టు కోల్పోవడం, బలహీనత
మాట తడబడటం లేదా సరిగా మాట్లాడలేకపోవడం
హఠాత్తుగా కంటిచూపు మసకబారడం
తీవ్రమైన తలతిరుగుడు లేదా నడవలేకపోవడం
గోల్డెన్ అవర్ అత్యంత కీలకం:
స్ట్రోక్ లక్షణాలు కనిపించిన మొదటి 4.5 గంటల వ్యవధిని వైద్యరంగంలో అత్యంత కీలకమైన సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో రోగిని తగిన చికిత్సా సదుపాయాలు ఉన్న ఆసుపత్రికి చేరిస్తే, రక్తం గడ్డకట్టడాన్ని కరిగించే ఇంజెక్షన్ల ద్వారా ప్రాణాపాయం నుంచి, శాశ్వత వైకల్యం నుంచి కాపాడే అవకాశం ఉంటుంది.
నివారణకు నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలు
క్రమం తప్పకుండా స్క్రీనింగ్:
30 ఏళ్లు దాటిన వారు ఏడాదికి కనీసం ఒక్కసారైనా బీపీ, షుగర్, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకోవాలి. కుటుంబంలో స్ట్రోక్ లేదా గుండె జబ్బుల చరిత్ర ఉంటే మరింత ముందుగానే పరీక్షలు ప్రారంభించాలి.
ఆహార నియమాలు:
ఉప్పు వాడకం తగ్గించాలి. వేపుళ్లు, నూనె పదార్థాలు, మితిమీరిన తీపిని నియంత్రించాలి.
శారీరక శ్రమ:
వారానికి కనీసం 150 నిమిషాల పాటు వేగంగా నడవడం లేదా ఇతర తేలికపాటి వ్యాయామాలు చేయాలి.
వ్యసనాలకు దూరం:
ధూమపానం, పొగాకు ఉత్పత్తులకు పూర్తిగా దూరంగా ఉండాలి.
వైద్యుల సలహా:
ఇప్పటికే బీపీ, షుగర్‌లకు మందులు వాడుతుంటే, "బాగానే ఉన్నాం కదా" అని సొంత నిర్ణయాలతో మందులు ఆపకూడదు.

