Sugarcane Juice: అలాంటి వాళ్లు చెరకు రసం తాగకూడదా.?
చెరకు రసం తాగకూడదా.?

Sugarcane Juice: ఎవరైతే మధుమేహం లేదా డయాబెటిస్‌తో బాధపడుతున్నారో, వారు చెరకు రసానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దీనికి ప్రధాన కారణం చెరకు రసంలో ఉండే 'గ్లైసెమిక్ ఇండెక్స్'. ఇది చాలా అధికంగా ఉంటుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను ఎంత వేగంగా పెంచుతుందో చెప్పేదే ఈ గ్లైసెమిక్ ఇండెక్స్. డయాబెటిస్ రోగులు చెరకు రసం తాగిన వెంటనే, అందులోని సహజ చక్కెరలు రక్తంలో కలిసిపోయి షుగర్ లెవల్స్‌ను ఒక్కసారిగా అసాధారణ స్థాయికి పెంచేస్తాయి. ఇది ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు.
కేవలం షుగర్ మాత్రమే కాదు.. చెరకు రసం అధికంగా తీసుకోవడం వల్ల కాలేయం (Liver),గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చెరకు రసంలోని అధిక ఫ్రక్టోజ్ వల్ల కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది కాలక్రమేణా 'ఫ్యాటీ లివర్' సమస్యకు దారితీస్తుంది. అలాగే రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు పెరగడం వల్ల గుండె పనితీరుపై కూడా ప్రభావం పడుతుంది. ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు లేదా కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు దీనికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం.
వీరితో పాటు, తక్కువ రోగనిరోధక శక్తి (Low Immunity) ఉన్నవారు,తరచూ జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా చెరకు రసం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు పక్కన లభించే చెరకు రసం తయారీలో పరిశుభ్రత లోపిస్తే.. ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మిత్రులారా.. వేసవి తాపం తీర్చుకోవడానికి చెరకు రసం మంచిదే కానీ, మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోండి.

