Silent Killer Fatty Liver: ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు మనకు తెలియకుండానే అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. వాటిలో ముఖ్యంగా ఫ్యాటీ లివర్ ఇప్పుడు ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. ప్రారంభంలో ఎటువంటి తీవ్రమైన లక్షణాలను చూపించకపోవడంతో చాలామంది దీనిని సాధారణ అలసటగా భావించి పొరపడుతుంటారు. కానీ, సకాలంలో గుర్తించకపోతే ఇది కాలేయ పనితీరును పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏమిటి ఈ ఫ్యాటీ లివర్?

కాలేయ కణాలలో కొవ్వు క్రమంగా పేరుకుపోవడాన్నే ఫ్యాటీ లివర్ అంటారు. సాధారణంగా కాలేయంలో కొద్దిపాటి కొవ్వు ఉండటం సహజమే. అయితే కాలేయం మొత్తం బరువులో ఈ కొవ్వు శాతం 5 నుండి 10 శాతానికి మించితే అది ఆరోగ్య సమస్యగా మారుతుంది. శరీరం కొవ్వును సరిగ్గా వినియోగించుకోలేనప్పుడు లేదా కొవ్వు ఉత్పత్తి మితిమీరినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

మూడు ప్రమాదకర దశలు:

ఫ్యాటీ లివర్ తీవ్రతను మూడు దశలుగా విభజించవచ్చు:

గ్రేడ్ 1: కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. కేవలం జీవనశైలి మార్పులతో దీనిని నయం చేయవచ్చు.

గ్రేడ్ 2: కొవ్వు పెరగడం వల్ల అలసట, జీర్ణ సమస్యలు మొదలవుతాయి.

గ్రేడ్ 3: ఇది అత్యంత ప్రమాదకరమైన దశ. ఇది ఫైబ్రోసిస్ లేదా సిర్రోసిస్ వంటి కాలేయ వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది.

శరీరం ఇచ్చే ఆ సంకేతాలను గమనించండి

ఫ్యాటీ లివర్ ప్రారంభంలో పెద్దగా బయటపడదు. కానీ శరీరం ఇచ్చే ఈ చిన్న చిన్న మార్పులను గమనిస్తే ముందుగానే మేల్కొనవచ్చు:

నిరంతరంగా ఉండే అలసట, నీరసం.

పొట్ట కుడి భాగంలో పైన బరువుగా లేదా ఒత్తిడిగా అనిపించడం.

భోజనం తర్వాత విపరీతమైన గ్యాస్, కడుపు ఉబ్బరం.

మెడ లేదా ముఖం చుట్టూ చర్మం నల్లబడటం.

నాలుకపై తెల్లటి పూత ఏర్పడటం.

బరువు తక్కువ ఉన్నా రావచ్చు

చాలామంది ఫ్యాటీ లివర్ అంటే కేవలం లావుగా ఉన్నవారికే వస్తుందని అనుకుంటారు. కానీ, బరువు తక్కువగా ఉన్నా లేదా సాధారణ బరువు ఉన్నవారిలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. దీనిని లీన్ ఫ్యాటీ లివర్ ని పిలుస్తారు. అందుకే కేవలం బరువును బట్టి కాకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం.

నివారణ మార్గాలు:

ఆయుర్వేద దృక్కోణం ప్రకారం, జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడం వల్ల శరీరంలో ఆమ్ పేరుకుపోయి కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది. దీనిని అరికట్టాలంటే:

సరైన సమయానికి పోషకాహారం తీసుకోవాలి.

శారీరక శ్రమ లేదా వ్యాయామం తప్పనిసరి.

మద్యపానం, అతిగా వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.

ప్రారంభ దశలోనే ఈ లక్షణాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story