Thyroid Disorders: నిశబ్దంగా ముంచెత్తే థైరాయిడ్ సమస్యలు.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..
ప్రాణాలకే ముప్పు..

Thyroid Disorders: నేటి ఆధునిక జీవనశైలి, విపరీతమైన ఒత్తిడి కారణంగా ఎంతోమందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఈ చిన్న గ్రంథి మన శరీర మొత్తం పనితీరును శాసిస్తుంది. శరీర మెటబాలిజం, గుండె స్పందనల వేగం, శరీర ఉష్ణోగ్రత నుంచి మానసిక సమతుల్యత వరకు ప్రతి అంశాన్ని థైరాయిడ్ హార్మోన్లు నియంత్రిస్తాయి. అయితే వీటి స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడినప్పుడు శరీరం అనేక ముందస్తు సంకేతాలను పంపుతుంది. వీటిని సరైన సమయంలో గుర్తించకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
థైరాయిడ్ అసమతుల్యత – రెండు రకాలు
థైరాయిడ్ సమస్యలు ప్రధానంగా రెండు రూపాల్లో కనిపిస్తాయి:
హైపోథైరాయిడిజం: థైరాయిడ్ గ్రంథి శరీరానికి అవసరమైన దానికంటే తక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
హైపర్‌థైరాయిడిజం: గ్రంథి అవసరానికి మించి అధికంగా హార్మోన్లను విడుదల చేసినప్పుడు ఇది సంభవిస్తుంది.
ఈ రెండు పరిస్థితుల్లోనూ శరీర వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమవుతాయి.
నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం.. విస్మరించకూడని లక్షణాలు
థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత మెదడు, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఢిల్లీ పట్పర్‌గంజ్‌లోని మ్యాక్స్ ఆసుపత్రి ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ మీనాక్షి జైన్ వెల్లడించారు.
నిరంతరం చిరాకు, ఆందోళన, తీవ్రమైన డిప్రెషన్
జ్ఞాపకశక్తి మందగించడం, ఏకాగ్రత లోపించడం
నిద్రలేమి లేదా అమితమైన నిద్రమత్తు
నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పడం లేదా తడబడటం
గుండె దడ పెరగడం, అధికంగా చెమటలు పట్టడం, నరాల బలహీనత
థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు తీవ్రస్థాయిలో పడిపోతే అది అపస్మారక స్థితికి (కోమా) దారితీసే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మహిళల్లో ఎందుకు ఎక్కువ?
పురుషులతో పోలిస్తే మహిళల్లో థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. యుక్తవయస్సు, గర్భధారణ, ప్రసవం అనంతరం, మెనోపాజ్ దశల్లో మహిళల శరీరంలో భారీగా హార్మోన్ల మార్పులు చోటుచేసుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. వీటికితోడు అధిక పని ఒత్తిడి, పోషకాహార లోపం, జన్యుపరమైన కారణాలు కూడా థైరాయిడ్ ముప్పును పెంచుతాయి.
నియంత్రణకు నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలు
వైద్యుల పర్యవేక్షణ: లక్షణాలు కనిపించిన వెంటనే థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలి. వైద్యులు సూచించిన మందులను సమయానికి వాడాలి.
రెగ్యులర్ టెస్టులు: మందులు వాడుతున్న వారు ప్రతి 6 నుంచి 8 వారాలకు ఒకసారి థైరాయిడ్ స్థాయిలను పరీక్షించుకుంటూ డోసేజ్‌ను అడ్జస్ట్ చేసుకోవాలి.
సమతుల్య ఆహారం: జింక్, సెలీనియం, ఐరన్ పుష్కలంగా ఉండే సమతుల్య ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలి.
నిద్ర – వ్యాయామం: ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర అవసరం. హార్మోన్ల సమతుల్యత కోసం రోజూ క్రమం తప్పకుండా యోగా, వ్యాయామాలు చేయాలి.
చిన్న మార్పులే కదా అని విస్మరిస్తే థైరాయిడ్ గుండె, మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలో వచ్చే ముందస్తు సంకేతాలను గుర్తించి వెంటనే అప్రమత్తం కావడమే ఉత్తమ మార్గం.

