Bladder Cancer: సింగిల్ యూరిన్ టెస్ట్‌తో 92శాతం బ్లాడర్ క్యాన్సర్ గుర్తింపు.. వైద్య రంగంలో కీలక ముందడుగు
కీలక ముందడుగు

Bladder Cancer: మూత్రాశయ క్యాన్సర్ నిర్ధారణలో వైద్య నిపుణులు సరికొత్త విప్లవాత్మక పురోగతిని సాధించారు. కేవలం ఒకే ఒక్క మూత్ర పరీక్ష ద్వారా 90 శాతానికి పైగా మూత్రాశయ క్యాన్సర్ కేసులను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. యూరోపియన్ యూరాలజీ ఆంకాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన వివరాలు వైద్య రంగంలో సరికొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి.
92శాతం ఖచ్చితత్వంతో గేలియాస్ పరీక్ష
బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం, క్యాన్సర్ రీసెర్చ్ యూకే సహకారంతో నోనాకస్ అనే డయాగ్నస్టిక్ సంస్థ గేలియాస్ అనే అధునాతన మూత్ర పరీక్షను అభివృద్ధి చేసింది.
ఈ పరీక్ష మూత్రంలోని క్యాన్సర్ కణాలకు సంబంధించిన డీఎన్‌ఏ మార్పులను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది.
దాదాపు 23 జన్యువులలోని 450 కంటే ఎక్కువ డీఎన్‌ఏ మ్యుటేషన్లను ఇది గుర్తిస్తుంది.
ఇంగ్లాండ్, స్కాట్లాండ్‌లోని 7 ఆసుపత్రులలో సుమారు 1,000 మంది రోగులపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ఈ పరీక్ష 92శాతం ఖచ్చితత్వంతో క్యాన్సర్‌ను గుర్తించింది.
పరీక్షలో నెగెటివ్ వచ్చిన వారికి క్యాన్సర్ లేకపోవడానికి 99శాతం కంటే ఎక్కువ అవకాశమున్నట్లు తేలింది.
సిస్టోస్కోపీ భారం, వేచి ఉండే సమయం తగ్గే అవకాశం
ప్రస్తుతం బ్లాడర్ క్యాన్సర్‌ను నిర్ధారించడానికి సిస్టోస్కోపీ ప్రక్రియపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇందులో కెమెరా అమర్చిన సన్నని ట్యూబ్‌ను మూత్రనాళం ద్వారా లోపలికి పంపి మూత్రాశయాన్ని పరీక్షిస్తారు. ఇది రోగికి ఎంతో అసౌకర్యంతో పాటు ఖరీదైన, శస్త్రచికిత్స లాంటి పద్ధతి. ఈ కొత్త మూత్ర పరీక్ష సిస్టోస్కోపీకి పూర్తి ప్రత్యామ్నాయం కానప్పటికీ, అత్యవసరంగా ఎవరికి పరీక్ష అవసరమో గుర్తించడంలో వైద్యులకు ప్రాధాన్యతా సాధనంగా ఉపయోగపడుతుంది. దీనివల్ల అనవసరమైన సిస్టోస్కోపీల సంఖ్య గణనీయంగా తగ్గి, రోగుల వెయిటింగ్ పీరియడ్ తగ్గుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ రిచర్డ్ బ్రయాన్ తెలిపారు.
పురుషుల్లో ముప్పు ఎక్కువ: లక్షణాలు ఇవే
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే క్యాన్సర్లలో ఇది 10వ స్థానంలో ఉంది.
మహిళలతో పోలిస్తే పురుషులలో, ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ ముప్పు 3 రెట్లు ఎక్కువ.
ధూమపానం దీనికి ప్రధాన కారణాలలో ఒకటిగా ఉంటోంది.
మూత్రంలో రక్తం పడటం, మూత్రవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి లేదా మంట, తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం దీని ప్రాథమిక లక్షణాలు.
ఈ పరీక్ష పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి మరిన్ని విస్తృత పరిశోధనలు అవసరమని క్యాన్సర్ రీసెర్చ్ యూకే ప్రతినిధి మిషెల్ మిచెల్ పేర్కొన్నారు. అయినప్పటికీ, తక్కువ ఖర్చుతో, నొప్పిలేకుండా వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు ఈ స్క్రీనింగ్ పద్ధతి ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.

