Sitting for Long Hours: గంటల తరబడి కూర్చుని పని చేస్తున్నారా? వెన్నునొప్పి నుండి గుండె జబ్బుల వరకు.. పొంచి ఉన్న ముప్పులివే..
పొంచి ఉన్న ముప్పులివే..

Sitting for Long Hours: నేటి ఉరుకుల పరుగుల జీవనశైలిలో ఆఫీసు పని, ఆన్‌లైన్ చదువులు లేదా మొబైల్ వాడకం.. కారణం ఏదైనా సరే, గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం అనేది ఒక సాధారణ అలవాటుగా మారిపోయింది. అయితే ఈ సిట్టింగ్ కల్చర్ మన శరీరానికి నెమ్మదిగా విషంలా మారుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిరంతరం కూర్చోవడం వల్ల కలిగే అనర్థాలు, వాటిని నివారించే మార్గాలను ఆయన వివరించారు.
శరీరంపై చూపే తీవ్ర ప్రభావాలు:
ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల మన శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి..
వెన్నెముకపై ఒత్తిడి: కూర్చున్నప్పుడు వెన్నెముకపై విపరీతమైన ఒత్తిడి పడి కండరాలు బలహీనపడతాయి. ఇది దీర్ఘకాలిక నడుము నొప్పికి దారితీస్తుంది.
మందగించిన రక్త ప్రసరణ: కదలిక లేకపోవడం వల్ల కాళ్లు, చేతుల్లో రక్త ప్రసరణ తగ్గి వాపులు వచ్చే అవకాశం ఉంది.
జీవక్రియ మందగించడం: కేలరీలు సరిగ్గా ఖర్చు కాకపోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుతుంది.
కంటి సమస్యలు: నిరంతరం స్క్రీన్ వైపు చూడటం వల్ల కళ్లు అలసిపోవడం, మంటలు, దృష్టి లోపాలు ఏర్పడతాయి. ఇది మానసిక ఒత్తిడికి కూడా కారణమవుతుంది.
నిర్లక్ష్యం చేయకూడని లక్షణాలు:
మీలో ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలని డాక్టర్ సూచిస్తున్నారు.
తరచుగా వచ్చే వెన్నునొప్పి లేదా మెడ నొప్పి.
కాళ్లు, చేతుల్లో వాపు, తిమ్మిర్లు.
కళ్లు మండుతున్నట్లు అనిపించడం, కంటి అలసట.
ఎంత నిద్రపోయినా శక్తి లేనట్లు అనిపించడం, చంచలత్వం.
శారీరక శ్రమ లేకపోయినా బరువు పెరగడం.
నివారణ మార్గాలు ఇవే:
చిన్నపాటి జాగ్రత్తలతో ఈ సమస్యల నుండి బయటపడవచ్చు..
ప్రతి గంటకు విరామం: పని మధ్యలో ప్రతి గంటకు ఒకసారి సీటు నుండి లేచి 5 నిమిషాల పాటు అటు ఇటు నడవండి.
స్ట్రెచింగ్ వ్యాయామాలు: లేచినప్పుడు చేతులు, కాళ్లు మరియు వెన్నును కొద్దిగా సాగదీయండి.
సరైన భంగిమ: కూర్చున్నప్పుడు వెన్నుముక తిన్నగా ఉండాలి. కంప్యూటర్ స్క్రీన్ మీ కంటి స్థాయికి సమానంగా ఉండేలా చూసుకోండి.
ఆహారం - నీరు: సమతుల్య ఆహారం తీసుకుంటూ, రోజుకు సరిపడా నీరు త్రాగాలి.
వ్యాయామం: యోగా లేదా నడకను మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోండి.
కూర్చోవడం అనేది కొత్త రకమైన ధూమపానం అని నిపుణులు అంటుంటారు. కాబట్టి పని ముఖ్యం అనుకుంటూ మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టకండి. చిన్న విరామాలు మీ పని సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

