గుండెకు ముప్పే

Skipping Breakfast: ఆధునిక జీవనశైలిలో చాలామంది సమయం లేకనో లేదా బరువు తగ్గాలనే ఉద్దేశంతోనో ఉదయం అల్పాహారాన్ని (బ్రేక్‌ఫాస్ట్) విస్మరిస్తుంటారు. అయితే, ఈ అలవాటు ప్రాణాంతకమైన గుండె జబ్బులకు దారితీస్తుందని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. గత ఏడాది సుమారు 23 లక్షల మందిపై నిర్వహించిన ఒక సమగ్ర పరిశోధనలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్రమం తప్పకుండా బ్రేక్‌ఫాస్ట్ మానేసే వారిలో గుండె సంబంధిత వ్యాధుల ముప్పు 17 శాతం, అలాగే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం 15 శాతం పెరుగుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.

ఉదయం పూట ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుందని వైద్యులు వివరిస్తున్నారు. దీని ప్రభావంతో రక్తపోటు (Blood Pressure) పెరగడం, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ మార్పులు క్రమంగా గుండె పనితీరుపై ఒత్తిడిని పెంచి, గుండెపోటుకు కారణమవుతాయి. రాత్రంతా ఖాళీ కడుపుతో ఉన్న శరీరానికి ఉదయం తగిన శక్తి అందకపోతే, అది మెటబాలిజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

బరువు తగ్గాలనే లక్ష్యంతో అల్పాహారాన్ని మానేయడం సరైన పద్ధతి కాదని నిపుణులు సూచిస్తున్నారు. బరువును నియంత్రించుకోవాలనుకునే వారు ఉదయం టిఫిన్‌ను వదులుకోవడానికి బదులు, రాత్రిపూట భోజనాన్ని త్వరగా ముగించడం అత్యుత్తమ మార్గమని వారు చెబుతున్నారు. ప్రతిరోజూ పోషకాలతో కూడిన అల్పాహారాన్ని తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయని, తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story