Sleeping Late at Night: “ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్” అనే సూత్రాన్ని పెద్దలు ఎందుకు చెప్పారో ఇప్పుడు శాస్త్రీయంగా నిరూపితమవుతోంది. అర్ధరాత్రి వరకు మొబైల్ చూసి, తర్వాత ఎప్పటికో నిద్రపోయే అలవాటు శరీరంలోని ముఖ్యమైన అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు వల్ల మరుసటి రోజు తీవ్ర అలసట, బద్ధకం కలుగడమే కాకుండా గుండె, కాలేయం, మెదడు, మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది.

ప్రతి రోజూ నిద్ర సమయం మారడం వల్ల శరీరంలోని జీవక్రియ, హార్మోన్ల సమతుల్యత, రక్తంలో చక్కెర నియంత్రణపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఆరోగ్యానికి నిద్ర ఎంత ముఖ్యమో, క్రమమైన నిద్రవేళలు పాటించడం కూడా అంతే ముఖ్యమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. శరీరంలోని జీవ గడియారం రక్తంలో చక్కెర స్థాయిలు, జీవక్రియను నియంత్రిస్తుంది. తగినంత నిద్ర లేకపోవడం లేదా సరైన సమయానికి నిద్రపోకపోవడం వల్ల ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకునే శరీర సామర్థ్యం తగ్గుతుంది. దీంతో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. ఎక్కువ కాలం ఇలాగే కొనసాగితే టైప్-2 డయాబెటిస్, అధిక బరువు పెరిగే ప్రమాదం ఉంది.

రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఆకలిని నియంత్రించే హార్మోన్లపై కూడా ప్రభావం పడుతుంది. గ్రెలిన్ (ఆకలిని పెంచే హార్మోన్) పెరిగి, లెప్టిన్ (కడుపు నిండిన భావన కలిగించే హార్మోన్) తగ్గుతుంది. దీనివల్ల తరచూ ఆకలి వేయడంతోపాటు తీపి పదార్థాలు తినాలనే కోరిక కలుగుతుంది. ఫలితంగా అధిక కేలరీల ఆహారం ఎక్కువగా తిని బరువు పెరిగే అవకాశం ఉంది. కాలేయం గ్లూకోజ్, కొవ్వుల జీవక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. క్రమపద్ధతిలో నిద్రపోకుంటే కాలేయ పనితీరు దెబ్బతింటుంది.

నిద్రలేమి, అనియమిత నిద్రవేళలు గుండెపై తీవ్ర ఒత్తిడి కలిగిస్తాయి. రక్తపోటులో హెచ్చుతగ్గులు, శరీరంలో వాపు పెరగడం, గుండె పనితీరు బలహీనపడటం జరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేయడానికి నిద్ర చాలా అవసరం. తగినంత నిద్ర లేకుంటే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గి, చిరాకు, మానసిక అలసట కలుగుతాయి. మూత్రపిండాలు రక్తపోటు, హార్మోన్ల ఉత్పత్తి, రక్తం వడపోతను నియంత్రిస్తాయి. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మూత్రపిండాలకు హాని జరిగే అవకాశం పెరుగుతుంది.

ఆరోగ్య నిపుణులు సూచించే మార్గాలు: ప్రతిరోజూ 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. ప్రతి రోజు ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం చేయాలి. నిద్రకు ముందు అతిగా తినవద్దు. మొబైల్, టీవీ స్క్రీన్ సమయాన్ని తగ్గించాలి. సాయంత్రం తర్వాత టీ, కాఫీ నివారించాలి. నిద్రకు ముందు మంచి పుస్తకం చదవడం లేదా గోరువెచ్చని పాలు తాగడం మంచిది. ఈ అలవాట్లు పాటిస్తే శరీర అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి.

Next Story