Staying Awake Past 11 PM: రాత్రి 11 దాటినా మేల్కొంటున్నారా.. అయితే మీరు ఎంత వ్యాయామం చేసినా వృథానే..
అయితే మీరు ఎంత వ్యాయామం చేసినా వృథానే..

Staying Awake Past 11 PM: బరువు తగ్గాలని గంటల తరబడి జిమ్‌లో చెమట చిందిస్తున్నారా? డైటింగ్ పేరుతో ఇష్టమైన ఆహారాన్ని మానేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి! మీరు రాత్రి 11 గంటల తర్వాత కూడా మేల్కొని ఉంటున్నారా? అయితే మీరు చేసే ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా నిద్రపోకపోతే మీ బరువు తగ్గకపోగా, మరిన్ని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్న వారవుతారని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
జీవక్రియ - నిద్ర మధ్య ఉన్న రహస్యం..
మన శరీరం ఒక జీవ గడియారం ప్రకారం పనిచేస్తుంది. రాత్రి 10:30 గంటల తర్వాత శరీరంలో జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఆ సమయంలో నిద్రపోకుండా మేల్కొని ఉంటే, శరీరం ఒత్తిడికి గురై కార్టిసాల్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. కార్టిసాల్ రక్తంలో ఉన్నప్పుడు, శరీరం కొవ్వును కాల్చడం ఆపేసి, దానిని నిల్వ చేయడం ప్రారంభిస్తుంది. రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల మధ్య మన శరీర కణాలు మరమ్మత్తు చేసుకుంటాయి. ఈ సమయంలో నిద్రపోకపోతే జీవక్రియ పూర్తిగా దెబ్బతింటుంది.
ఇన్సులిన్ స్పైక్స్ - ఆకలి:
రాత్రిపూట మేల్కొని ఉండటం వల్ల ఇన్సులిన్ స్థాయిలలో అకస్మాత్తుగా మార్పులు వస్తాయి. ఇది బరువు పెరగడానికి ప్రధాన కారణం. అంతేకాకుండా నిద్ర లేకపోవడం వల్ల ఆకలిని నియంత్రించే హార్మోన్లు అసమతుల్యతకు గురై, రాత్రిపూట జంక్ ఫుడ్ తినాలనే కోరికను పెంచుతాయి. ఫలితంగా మీరు తాగే డీటాక్స్ డ్రింక్స్, చేసే వ్యాయామాలు ఏవీ ఫలితాన్ని ఇవ్వవు.
జీర్ణక్రియపై ప్రభావం:
రాత్రి 11 గంటల తర్వాత మేల్కొని ఉంటే శరీరం యొక్క సహజ వ్యర్థాల శుద్ధి ప్రక్రియ ఆగిపోతుంది. దీనివల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.జీర్ణవ్యవస్థ బలహీనపడి శరీరం మరింత కొవ్వును ప్రోగు చేస్తుంది.
నిపుణులు సూచిస్తున్న ఆరోగ్య సూత్రాలు..
బరువు తగ్గాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ నియమాలు తప్పనిసరి:
1. రాత్రి 11 గంటల లోపే కచ్చితంగా నిద్రపోవాలి.
2. పడుకునే గంట ముందే మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను పక్కన పెట్టేయాలి.
3. ముందస్తు భోజనం: నిద్రపోవడానికి కనీసం 3 గంటల ముందే భోజనం ముగించాలి.
4. క్రమశిక్షణ: ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి.

